Tuesday, May 7, 2024

Big Story: చమురు దిగుమతి బిల్లు డబుల్‌.. మార్చి 31నాటికి 100 బిలియన్‌ డాలర్లకు

భారత్‌లో ముడిచమురు దిగుమతి బిల్లు విలువ రెట్టింపు అవనుంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి విలువ మొత్తం రెండింతలు కానుంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31నాటికి బిల్లు 100బిలియన్‌ల డాలర్లు దాటనుందని అంచనా. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఈక్రమంలో దేశంలోనూ దిగుమతి బిల్లు రెట్టింపవుతోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు 94.3బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు పెట్రోలియం మంత్రిత్వశాఖకు చెందిన పీపీఎసీ వెల్లడించింది. అంతర్జాతీయంగా చమురు ధర పెరగడంతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం 11.6బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. గతేడాది జనవరిలో చమురు దిగుమతులకు భారత్‌ 7.7బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. అదేవిధంగా ఫిబ్రవరిలో బ్యారెల్‌ చమురు ధర 100 డాలర్లు దాటిన నేపథ్యంలో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థికసంవత్సరం నాటికి ఏడాది మొత్తం బిల్లు 110-115బిలియన్‌ డాలర్లుకు చేరుకుంటుందని పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలిసిస్‌ సెల్‌ తెలిపింది. కాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 196.5మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌కు భారత్‌ 62.2 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 227మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుని 101.4బిలియన్‌ డాలర్లను చెల్లించింది.

ఈ ఏడాది ఇప్పటికే 175.9మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా-రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగాక్రూడ్‌ ఆయిల్‌ ధర ఏడేళ్ల గరిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడి చమురు ధర వందడాలర్లు దాటింది. 2022 ప్రారంభంతో పోలిస్తే ముడి చమురుధరలు ప్రస్తుతం 23శాతం వరకు పెరిగాయి. అయితే దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఏవిధమైన మార్పులేదు. 5రాష్ట్రాల ఎన్నికలు అనంతరం పెట్రోధరలు పెరుగుతాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు చమురు మార్కెటింగ్‌ సంస్థలకు సంబంధించిన విషయం అయినప్పటికీ దేశంలోని ప్రధాన కంపెనీలు ఇండియన్‌ ఆయిల్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం వంటివి ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఆ సంస్థలు పెట్రోధరలపై నిర్ణయాలు తీసుకుంటాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా భారత్‌లో పెంపు లేకుండా కేంద్రం కట్టడి చేస్తుందని మార్కెటింగ్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement