Sunday, December 4, 2022

ఫాంహౌజ్ కేసు నిందితులకు సుప్రీంలో దొరకని ఊరట.. రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ తిరస్కరణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. తమ రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ నిందితులు రామచంద్ర భారతి అలియాస్ వీకే సతీశ్ శర్మ, నందు కుమార్, సింహయాజి స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రంనాథ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపి, పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు వెల్లడించింది. అయితే ఈ వ్యవహారంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు సమర్థనీయం కాదని, తీర్పులో ప్రస్తావించిన అంశాలు సమంజసంగా లేవని అభిప్రాయపడింది.

- Advertisement -
   

నిందితులకు రిమాండ్ విధించే విషయంలో అరుణేశ్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తప్పుగా తీసుకుందని పేర్కొంది. మొత్తంగా నిందితులు హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. కేసులో మెరిట్స్ ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఈ కేసులో పిటిషనర్ల (నిందితులు) తరఫున న్యాయవాది తన్మయ్ మెహతా వాదనలు వినిపించగా, ప్రతివాదిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాదులు దుష్యంత్ దవే, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు.

ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించే కేసు.. తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర‌ ప్రభుత్వం (తెలంగాణ పోలీసుల) తరఫున ప్రముఖ న్యాయవాదులు దుష్యంత్ దవే, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తూ.. నిందితుల వాదనల చూస్తుంటే ఏ కేసులోనూ అరెస్టు అన్నదే చేయకూడదు అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. చట్ట ప్రకారం ఏ కోర్టు ఆదేశించకపోయినా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసే అధికారం ఉందని చెప్పారు. ప్రతి కేసులోనూ నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత అరెస్ట్ చేయాలంటే నేర విచారణ సాధ్యం కాదని అన్నారు. అరెస్టు చేయడానికి తగిన కారణాలున్నాయని పోలీసు అధికారి సంతృప్తి చెందితే చాలని తెలిపారు.

ఈ కేసులో నిందితులు ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు ఇవ్వజాపారని, అంత తీవ్రమైన నేరానికి పాల్పడేవారి విషయంలో నిందితులకు వెసులుబాట్లు ఇవ్వడం తగదని అన్నారు. ట్రాప్ చేసిన కేసుల్లో వెంటనే అరెస్టు చేయకపోతే, నిందితులు ఆధారాలను చెరిపేసే అవకాశం ఉంటుందని అన్నారు. అందుకే పోలీసులు వారిని అక్కడికక్కడ అరెస్ట్ చేశారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించే తీవ్రమైన నేరమని వ్యాఖ్యానించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణలో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది. అయితే నిందితుల తరఫున పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటూ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. తమ ఎదుట బెయిల్ పిటిషన్ ఉన్నట్టయితే బెయిల్ మంజూరు చేసేవాళ్లమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సిట్ విచారణ కొనసాగుతుంది
సిట్ విచారణ, సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణపై దాఖలు చేసిన మరో పిటిషన్‌పైనా ధర్మాసనం విచారణ జరిపింది. అసలు విచారణే అవసరం లేని కేసులో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ ఎందుకని, మొత్తం కేసునే కొట్టేయాలని కోరుతూ నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి పిటిషన్ దాఖలు చేయగా.. ఈ వాదనలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ట్రయల్ కోర్టు పక్కనపెట్టింది కేవలం అవినీతి నిరోధక చట్టం సెక్షన్లను మాత్రమేనని, మొత్తం కేసును కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనడానికి జరిగిన ప్రయత్నాలను అక్కడున్న సాక్ష్యాధారాలన్నీ రుజువు చేస్తున్నాయని, అన్నింటినీ పోలీసులు పరిశీలించిన తర్వాతనే అరెస్టు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు. పోలీసుల దర్యాప్తు మరింత స్వతంత్రంగా జరగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించిందని, సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఈ విచారణ జరపాలని, దర్యాప్తు పురోగతిపై కాలపరిమితితో సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు.

వాదోపవాదాల అనంతరం ధర్మాసనం ఈ పిటిషన్‌ను సైతం తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. అయితే హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పెండింగులో ఉన్న అన్ని అంశాలను 4 వారాల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణపై డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. సిట్ విచారణ స్వేచ్ఛగా జరగాలని, ఆంక్షలు విధించడం సరికాదని అభిప్రాయపడింది. సీల్డ్ కవర్లో నివేదికలు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ 4 వారాల్లోగా ప్రతిస్పందన తెలియజేయాలని ఆదేశించింది. కేసు విచారణ 4 వారాల అనంతరం వాయిదా వేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement