Friday, June 14, 2024

చరిత్రలో తెలుగు వారి పాత్రను గ్రంథస్థం చేయాలి.. ఢిల్లీ తెలుగు అకాడమీ వార్షిక సాంస్కృతిక ఉత్సవాల్లో జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీ తెలుగు అకాడమీ 34వ వార్షిక సాస్కృతిక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. న్యూఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్‌లో డీటీఏ అడిషనల్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్లోబల్ తెలుగు అకాడమీ డిజిటల్ పోర్టల్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. తెలుగు వారి శ్రేయస్సే లక్ష్యంగా నడిచే డీటీఏ వంటి సంస్థలు మనుగడ సాగించాలంటే ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.

చరిత్రలో తెలుగు వారి పాత్రపై నివేదిక తయారు చేసి గ్రంథస్థం చేయవలసిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. తెలుగు వారి కోసం ఎన్నో అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రవాసాంధ్రుల సాంఘిక, సాంస్కృతిక అవసరాలను తీరుస్తూ తెలుగు భాష, సంస్కృతుల వికాసానికి తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు దివంగత ఎన్.వి.ఎల్ నాగరాజు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును జీవీఎల్ నరసింహారావు గ్లోబల్ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ హరి ఇప్పనపల్లికి ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా హరి ఇప్పనపల్లి మాట్లాడుతూ… మాతృభూమికి దూరంగా ఉన్నా మాతృ భాషపై మమకారం అలాగే ఉందని అన్నారు. రెండు రోజుల పాటు జరిగిన కార్యక్రమాలకు ప్రముఖులతో పాటు ఢిల్లీ నలుమూలల నుంచి తెలుగు వారు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement