Friday, April 26, 2024

700 మంది విద్యార్థులకు కరోనా!

తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకిన ఘటనలు ఇటీవల వరుసగా వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 700పైగా మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు నడిస్తే, కరోనా మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్యశాఖ హెచ్చరించింది. ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు బడులు నిర్వహించకపోవడమే మంచిదని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. అయితే, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే స్కూళ్ల మూసివేతపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం 6 నుంచి 9 తరగతుల వరకు ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెరగడంతో కోవిడ్‌ నిబంధనల అమలు సాధ్యపడటం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు కరోనా సోకే ప్రమాదం ఉందని వైద్యశాఖ అంచనాకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు నడిపితే కరోనా విజృంభించవచ్చని, 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహించకపోవడమే ఉత్తమమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో ఈసారి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా? లేదా ? అన్నది ఉత్కంఠగా మారింది. కరోనా కారణంగా గతేడాది పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు పలు పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పెద్దఎత్తున ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేస్తున్నారు. వ్యాధి నిర్ధరణ అయినవారికి చికిత్స అందిస్తున్నారు. దీనిపై విద్య, వైద్యశాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి.

ఇక, కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను మరింత పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నియంత్రణలోనే ఉందని ఈటల వెల్లడించారు. ఒకవేళ కేసులు పెరిగితే వైద్యసేవలు అందించేందుకు అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచుతామన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు మంత్రి ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement