Thursday, May 2, 2024

గులాబీ గూటికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ కండువ కప్పుకోనున్నారా? టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీలోకి చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. త్వరలో ఇద్దరి మధ్యా మరో భేటీ జరగనుంది. ఇప్పటికే రమణతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడారు. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్‌.రమణకు బీసీ వర్గాల్లో  మంచి గుర్తింపు ఉంది. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన బీసీ నాయకుడి స్థానాన్ని మరొక బీసీ నేతతోనే భర్తీ చేయడానికి టీఆర్ఎస్ అధిష్ఠానం వ్యూహ రచన చేస్తోంది. అంతేకాదు రమణకు మంత్రి పదవి కూడా ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఎల్.రమణ… రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నారని సమాచారం. ఈ నెల 3న ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కోవిడ్ కారణంగా వాటి ఎన్నికల ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్.రమణకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టుకోల్పోకుండా ఉండేందుకు టీఆర్ఎస్ అధిష్ఠానం వ్యూహా రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏకంగా టీటీడీపీ అధ్యక్షుడిని తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయినట్లు ప్రచారం జరుగుతోంది.

పార్టీ మార్పు అంశంపై ఎల్ ర‌మ‌ణ స్పందించారు. జూన్ 1న తాను బెంగుళూరులో ఉండగా ఎర్రబెల్లి ఫోన్ చేశారని చెప్పారు. సీఎం గుర్తు చేసుకున్న‌ట్లు ఎర్రబెల్లి త‌న‌తో అన్నార‌ని.. ఆస్ప‌త్రి ప‌నిపై బెంగ‌ళూరు వ‌చ్చిన‌ట్టు చెప్పాన‌ని ర‌మ‌ణ తెలిపారు. పార్టీ మారడంపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ అంశం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే తెలంగాణ టీడీపీకి చెందిన అనే మంది అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తలసాని, ఎర్రబెల్లి లాంటి వారు మంత్రులు కూడా అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ రెండు చోట్లు విజయం సాధించింది. అది కూడా ఖమ్మం జిల్లాలోనే. అయితే, టీఆర్ఎస్ నుంచి గెలిచిన సండ్ర వెంటక వీరయ్య, మచ్చ నాగేశ్వరరావులు ఇప్పటికే గులాబీ కండువ కప్పుకున్నారు. దీంతో అసెంబ్లీ టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యుడు లేకుండాపోయాడు. ఇక పార్టీలో ఎల్.రమణ సహా అతి కొంది మంది మాత్రమే మిగిలారు. ఇక వీరు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరితే ఇక తెలంగాణలో టీడీపీ శాశ్వతంగా భూస్తాపితం అయినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో పీవీ పేరుతో కొత్త జిల్లా ?

Advertisement

తాజా వార్తలు

Advertisement