Thursday, May 2, 2024

పెద్దల సభలో ఏడు ఖాళీలు.. నేడో, రేపో నోటిఫికేషన్‌

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ: పెద్దల సభకు ఎన్నికల కోసం నేతల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. శాసనసభ కోటాలో జూన్‌ నుంచి ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా కారణంగా గతంలో ఎన్నికలు నిర్వహించని కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలో షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశముందని, వచ్చే నెలలో ఈ ప్రక్రియను పూర్తిచేస్తుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగు తోంది. శాసనమండలిలో జూన్‌ నుంచి ఆరు ఖాళీలు కొనసా గుతున్నాయి. అసెంబ్లిd కోటా నుంచి మండలికి గతంలో ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్‌, ఆకుల లలిత పదవీకాలం జూన్‌ మూడో తేదీతో ముగిసింది. వాస్తవానికి ఆలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. కరోనా నేపథ్యంలో నిర్దిష్ట గడువులోగా ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని, ఎప్పుడు నిర్వహించేది తదుపరి ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో ప్రకటించింది. రాష్ట్రాల అభిప్రాయాలు సేకరణ సెకండ్‌ వేవ్‌ ప్రభావం కొంత మేర తగ్గిన తర్వాత.. ఎన్నికల నిర్వహణ విషయమై ఆగస్టు నెలలో ఈసీ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. కరోనా పాజిటివ్‌ కేసులు బాగానే నమోదవుతున్న దృష్ట్యా ఎన్నికలు ఇప్పుడే నిర్వహించవద్దని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నవంబర్‌ నెలలో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఆ తర్వాత హుజురాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఉప ఎన్నికల విషయమై కూడా రాష్ట్రాలను కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాలు తీసుకుంది. రెండు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు సానుకూలంగా లేకపోవడంతో కొంత సమయం తీసుకొని ఈసీ ఉపఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. గవర్నర్‌ కోటాకు సంబంధించి ఒక ఖాళీ ఉండగా, మంత్రివర్గం నామినేట్‌ చేసిన కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టింది.

నవంబర్‌లో ఎన్నికలు
ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. లక్షలాది మంది ఓటర్లు పాల్గొనే ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయని అంటున్నారు. కేవలం శాసనసభ్యులు ఓటు వేసే ఎన్నికలైనందున ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని.. ఎన్నికల నిర్వహించవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయవచ్చే ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల పదిలోగా మండలి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావచ్చని అంటున్నారు.

చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ పదవులకు కూడా…
చైర్మన్‌తో పాటు డిప్యూటీ చైర్మన్‌ పదవీకాలం కూడా జూన్‌ మూడో తేదీన పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రొటెం చైర్మన్‌గా భూపాల్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగే కొత్త చైర్మన్‌, డిప్యూటి చైర్మన్‌ పదవులకు ఎన్నికలు కూడా నిర్వహించవచ్చని అంటున్నారు. అయితే చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ల ఎన్నిక మళ్ళీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేవరకు కూడా పెండింగ్‌ పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చ జరుగుతోంది.

మరో 12 స్థానాలు రెడీ.. డిసెంబర్‌లోనే షెడ్యూల్‌
వచ్చే ఏడాది జనవరి నాటికే మరో 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన 12 మంది పదవీకాలం 2022 జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. హైదరాబాద్‌ జిల్లాకు చెందిన రెండు మినహా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలన్నీ ఖాళీ కానున్నాయి. పురాణం సతీష్‌ కుమార్‌, భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్‌రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. ఈ స్థానాలన్నీ కూడా అధికార టీఆర్‌ఎస్‌ సభ్యులవే. జనవరి 4వ తేదీలోగా వీటిని భర్తీచేయాల్సి ఉండడంతో డిసెంబర్‌లోనే ఈ స్థానాల భర్తీకి షెడ్యూల్‌ విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement