Thursday, May 2, 2024

ఢిల్లీ కోర్టులో గెజిట్‌

  • షరతులతో కృష్ణా, గోదావరి బోర్డులకు రాష్ట్రాల ఝలక్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నదీ యాజమాన్యాల బోర్డుల పరిధిలోకి తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను తీసుకొచ్చే వ్యవహారం కేంద్రం వద్దకు చేరింది. ఈనెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలై బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు రావాల్సి ఉన్నప్పటికీ అది ఇంకా జరగలేదు. కృష్ణా నదికి సంబంధించి తమ పరిధిలోని ఔట్‌లెట్లను అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం షరతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో తదుపరి ఏం చేయాలన్న విషయమై రెండు బోర్డులు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకువెళ్ళాయి. కేంద్ర జలశక్తి శాఖ సూచనలు, ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి నదీ యాజమాన్య బోర్డుల పరిధి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఈనెల 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. జులైలో కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటి నుంచి రెండు బోర్డులు వీటిపై దృష్టి సారించాయి. బోర్డుల సమావేశాలు, సమన్వయ సంఘాలు, ఉప సంఘాల సమావేశాలు నిర్వహించింది. అన్ని ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి అవసరం లేదని, గెజిట్‌లో మార్పులు చేయాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల్‌శక్తి శాఖను కోరాయి. రెండో షెడ్యూల్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ కొన్నింటిని ప్రాధాన్య క్రమంలో ఆధీనంలోకి తీసుకోవాలని కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ నిర్ణయించాయి. ఈ మేరకు ఇటీవల జరిగిన బోర్డుల ప్రత్యేక సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.

శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టుల నుంచి నేరుగా నీటిని తీసుకునే ఔట్‌లెట్లన్నింటినీ స్వాధీనం చేసేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణాబోర్డు ఈనెల 12న జరిగిన సమావేశంలో తీర్మానించింది. అందులో రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 15 ఔట్‌లెట్లు ఉన్నాయి. పెద్దవాగు మధ్య తరహా ప్రాజెక్టును బోర్డు ఆధీనంలోకి తీసుకునేందుకు గోదావరి బోర్డు నిర్ణయించింది. రెండు రాష్ట్రాలు కూడా ఇందుకు అంగీకరించాయి. కేంద్ర జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్‌ ప్రకారం బోర్డులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రాజెక్టులు, ఔట్‌లెట్లు, వాటికి సంబంధించిన అధికారులు, సిబ్బందిని స్వాధీనం చేయాల్సి ఉంటుంది. బోర్డులు తమంతకు తాముగా వాటిని ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగిస్తేనే వాటిని బోర్డులు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కృష్ణా బోర్డు సమావేశం తీర్మానం మేరకు ఏపీ ప్రభుత్వం తమ పరిధిలోని ఆరు ఔట్‌లెట్లను అప్పగించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తర్వులు అమలుకు షరతులు విధించింది. తెలంగాణ పరిధిలోని ఔట్‌లెట్లను అప్పగించినపుడే ఏపీ ఔట్‌లెట్లను కూడా అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదే సమయంలో జూరాల ప్రాజెక్టును కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉత్తర్వులోనే ఆ అంశాన్ని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఇచ్చేందుకు తెలంగాణ సుముఖంగా లేదు. ఇదే విషయాన్ని బోర్డుల సమావేశాల్లో స్పష్టం చేసింది. జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు మినహా మిగతా ఔట్‌లెట్లను అప్పగించే అంశాన్ని పరిశీలించవచ్చని నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను మినహాయించి మిగతా ఔట్‌లెట్లను అప్పగించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ఆరు ఔట్‌లెట్ల అప్పగింతకు సుముఖత వ్యక్తం చేసింది. కానీ ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు. 14నుండి అమలుచేయాల్సిన గెజిట్‌ మూడురోజులైనా అప్పగిం చలేదు. ఏం జరుగుతుంది? బోర్డులు కానీ.. కేంద్రం కానీ ఏం చేస్తాయి? దీనికి సంబంధించి గెజిట్‌లో ఎలా వ్యవహరించాల న్న దానిపై స్పష్టత లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -

మీవల్లే.. లేదు మీ వల్లే..
జల విద్యుత్‌ కేంద్రాలు బోర్డు పరిధిలోకి రాకపోతే గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రయోజనం ఏముంటుందని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. దిగువన సాగునీటి అవసరాలు లేకున్నప్పటికీ తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కోసం శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడంతోనే సమస్య తలెత్తిందని.. కేంద్రం నుంచి గెజిట్‌ వచ్చేందుకు కారణమైందని ఏపీ అంటోంది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను తెలంగాణ బోర్డుకు స్వాధీనం చేయకపోతే ఫలితం ఉండదని అంటున్నారు. మరోవైపు అసలు గెజిట్‌ రావడానికి కారణం ఏపీనేనని తెలంగాణ మండిపడుతోంది. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించకుంటే పంచాయితీ ఉండేది కాదని, దీనిని తాము ప్రశ్నిస్తే తమ ప్రాజెక్టులపై.. ఫిర్యాదులు చేసి, వివాదం పెంచి ఈ పరిస్థితి తెచ్చిందని తెలంగాణ అధికారులు భగ్గుమంటున్నారు. ఏపీ రాయలసీమ లిఫ్టే గెజిట్‌కు మూలమని తెలంగాణ అంటే, కనీస నీటిమట్టం లేని సమయంలో తెలంగాణ ఎవరినీ లెక్కచేయకుండా చేసిన విద్యుత్‌ ఉత్పత్తే కారణమని ఏపీ అంటోంది. ఎవరి వాదన వారు చేస్తున్నా.. తాము ఏం చేయాలో కృష్ణా బోర్డు అధికారులకు అయోమయ స్థితి నెలకొంది. గోదావరికి సంబంధించి కూడా రెండు రాష్ట్రాల నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఈ పరిస్థితుల్లో బోర్డులు ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. తదుపరి కార్యాచరణ కోసం కేంద్ర జల్‌శక్తి శాఖ వైపు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు చూస్తున్నాయి. సమావేశాల మినిట్స్‌తో పాటు రెండు రాష్ట్రాల ఉత్తర్వులు, స్పందనలను కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళగా, జల్‌శక్తి శాఖ ఆదేశాల ప్రకారం ముందుకెళ్ళాలని బోర్డులు డిసైడ్‌ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement