Friday, April 26, 2024

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కరోనా పరిస్థితులపై హైకోర్టుల విచారణ జరిగింది. ఆక్సిజన్, ఔషధాలపై తెలంగాణ హైకోర్టుకు కేంద్రం ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఇతర రాష్ట్రాల నుంచి 35 శాతం కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారన్న తెలంగాణ వినతిని పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ప్రధాని ఆదేశాల మేరకు తెలంగాణకు కోటా పెంచినట్లు కేంద్రం తెలిపింది. ఆక్సిజన్ 450 మెట్రిక్ టన్నుల నుంచి 650 మెట్రిక్ టన్నుల పెంచామని, రెమిడిసివిర్ ఇంజక్షన్లు 5 వేల నుంచి 10 వేలకు పెంచినట్లు వివరించింది. కేంద్ర ప్రభుత్వ స్పందనపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచన్‌లు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌లో ఉచిత భోజనం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కార్పొరేషన్‌లు ఎన్‌జీఓలతో ఒప్పందం చేసుకుని కమ్యునిటి కిచన్‌లు  ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రతిజిల్లా వెబ్‌ సైట్‌లో కమ్యూనిటీ కిచన్ వివరాలు పొందుపరచాలని హైకోర్టు సూచించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీనియర్ సిటిజన్‌లు, పేదవారికి వ్యాక్సినేషన్ కోసం ఎన్‌జీవోలతో ఒప్పందం చేసుకుని డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ పెట్టాలని తెలిపింది. కోవిడ్ టెస్టులను ప్రభుత్వం ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించింది. 13 జిల్లాల్లో కేవలం 20 వేల టెస్టులు మాత్రమే చేశారని పేర్కొంది. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ లో 3లక్షలు టెస్ట్ లు  మాత్రమే చేశారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఎలక్షన్ డ్యూటీలో ఉండి 500 మంది టీచర్లు కరోనా బారిన పడ్డారని… 15 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఎలక్షన్ డ్యూటీలో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలని పేర్కొంది. వారికి ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహకారం అందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్న హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ కమిషనర్లును తెలంగాణ హైకోర్టు అభినందించింది. లాక్‌డౌన్ సమయంలో, రిలాక్సేషన్ సమయంలో  వీడియో గ్రఫీ తీసిన ఫుటేజ్‌ను ముగ్గురు కమిషనర్లు హైకోర్టుకు సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్ పై 98 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాల ఏర్పాటు చేశామని, లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీ అమలుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ నెల 1 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదు తెలిపారు. మాస్కులు ధరించనందుకు 3,39,412 కేసులు, రూ.31కోట్ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు నమోదు చేశామని చెప్పారు. లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. లాక్‌ డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 వరకు గైడ్ లైన్స్‌ ను పటిష్టంగా అమలు చేసినందుకు ముగ్గురు సీపీలకు హైకోర్టు అభినందనలు తెలిపింది. పోలీసులు ఇదే విధంగా పని చేయాలని హైకోర్టు సూచించింది.

ఇక, మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలా సన్నద్ధమవుతుందో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలకు ఏర్పాట్లు, ఔషధాలపై వివరాలు సమర్పించాలని తెలిపింది. కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఎలా అడుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అనాథలుగా మారిన పిల్లల అక్రమ రవాణా, అక్రమ దత్తత ప్రమాదం పొంచి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement