Friday, May 3, 2024

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ప్రభుత్వం నివేదిక

కరోనా పరిస్థితులపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కరోనా పరిస్థితులపై డీహెచ్, డీజీపీ హైకోర్టుకు నివేదికను సమర్పించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రం అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఈనెల 1 నాటికి 2.97 కోట్ల కరోనా పరీక్షలు చేశామని వివరించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6,82,215 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. పాజిటివిటీ రేటు 2.29శాతం, మరణాల రేటు 0.5 శాతంగా ఉందని పేర్కొన్నారు. 34 ప్రభుత్వ, 76 ప్రైవేట్ ఆర్టీపీసీఆర్​, 1,231 రాపిడ్ పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం పెరిగిందని.. టీకా మొదటి డోసు 100శాతం, రెండో డోసు 69శాతం పూర్తైందని గత హైకోర్టు సమర్పించిన నివేదికలో శ్రీనివాసరావు పేర్కొన్నారు.

న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనల ఉల్లంఘనలపై 907 కేసులు నమోదు అయ్యాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సమయానికి మించి వేడుకలు నిర్వహించినందుకు 263 కేసులు నమోదు అయ్యాయని, పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు 644 కేసులు చేసినట్లు చెప్పారు. అలాగే మాస్కులు పెట్టుకోని వారికి జరిమానాలు విధిస్తున్నామని కోర్టుకు తెలిపారు. గత నెల 24 నుంచి ఈ నెల 2 వరకు 16,430 మందికి జరిమానా వేశామన్నారు. జూన్ 20 నుంచి డిసెంబరు 23 వరకు 5,10,837 మందికి జరిమానా విధించినట్లు చెప్పారు. ఈ నెల 10 వరకు సభలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతివ్వడం లేదని, జనం గుమిగూడకుండా పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

మరోవైపు కరోనా వ్యాప్తి దృష్ట్యా కోర్టులు, విద్యా సంస్థలు ఆన్ లైన్‌లో నిర్వహించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. కరోనా పరిస్థితులపై తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement