Tuesday, April 30, 2024

టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత

ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో మంత్రిగా సేవలందించిన టీఆర్ఎస్ నేత అజ్మీరా చందూలాల్ (67) తీవ్ర అనారోగ్యం కారణంగా హఠాన్మరణం చెందారు. ఆయనకు భార్య శారద, కుమారుడు ప్రహ్లాద్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ములుగు జిల్లా పరిధిలో ఉన్న జగ్గన్నపేటలో 1954 ఆగస్టు 17న జన్మించిన ఆయన, ఎంపీగా, ఎమ్మెల్యేగా పలుమార్లు విజయం సాధించారు.

ఇటీవల చందూలాల్‌కు కిడ్నీలు విఫలం కాగా వైద్యులు కొత్త కిడ్నీలను అమర్చారు. అప్పటి నుంచి డయాలసిస్‌పై ఆధారపడిన ఆయన, ఇటీవల మరోమారు అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి గురువారం రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చందూలాల్ ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశారు. అనంతరం 1994లో మరోమారు ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు. 2014 ఎన్నికల్లో మరోమారు విజయం సాధించి నూతన తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక, గిరిజన శాఖలను నిర్వహించారు. 2018 ఎన్నికల్లో ఓటమి చెంది రాజకీయాలకు కాస్తంత దూరం అయ్యారు.

కాగా చందూలాల్ మృతి పట్ల సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలో గిరిజనుల సంక్షేమానికి చందూలాల్ ఎంతో శ్రమించారని, ఆయన లేని లోటు పూడ్చలేనిది అని తెలిపారు. అటు పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా చందూలాల్ మృతి పట్ల సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement