Thursday, May 2, 2024

TS Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన?

తెలంగాణ కేబినెట్ ఈ రోజు స‌మావేశం కానుంది. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నేడు కీలక నిర్ణయం వెలువడే అవకాశముంది. తెలంగాణలో పండించిన వ‌రి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేయాల‌ని సోమ‌వారం సీఎం కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేసిన విషయం తెలిసిందే. 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్రం వ‌రి ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. అయితే, సీఎం కేసీఆర్ ప్రకటనపై స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం.. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొన‌బోమ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం సేకరణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్‌ భేటీ ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోళ్లు, పంటకు మద్దతు ధర, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. అనంతరం ప్రభుత్వ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ కేబినెట్ భేటీలో వ‌రి ధాన్యం కొనుగోలు వ్య‌వ‌హారంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. కేంద్ర ప్ర‌భుత్వంతో చేస్తున్న వ‌రి పోరును మ‌రింతే పెంచే అవ‌కాశాలు ఉన్నాయి. 

కాగా, తెలంగాణ ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనగడ సాగించలేకపోయిందని హెచ్చరించారు. పెద్ద కేంద్ర ప్రభుత్వం, పెద్ద మాటలు మాట్లాడే ప్రధానమంత్రికి చిన్న రాష్ట్రమైన తెలంగాణ రైతులు పండించిన పంటను కొనేందుకు డబ్బులు లేవా? లేదా నరేంద్ర మోదీకి మనసు లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీకు ఓట్లు కావాలి. కానీ ధాన్యం వద్దా? అని నిలదీశారు. తెలంగాణలో సీట్లు కావాలి, కానీ ధాన్యం వద్దా, ఇదేనా మీ రాజనీతి? అని అడిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement