Thursday, May 2, 2024

నేటి నుంచి దేశ వ్యాప్తంగా టీకా ఉత్సవ్

భారత్‌లో నేటి నుంచి టీకా ఉత్సవం ప్రారంభం కానుంది. 45 ఏళ్ల పైబడిన వారిలో అత్యధికులకు టీకాను ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహించి అర్హులైన అత్యధికులకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే టీకా నిల్వలు నిండుకోగా, పలు రాష్ట్రాలు తమకు అత్యవసరంగా టీకాను పంపిణీ చేయాలని కేంద్రానికి లేఖలు రాశాయి. చాలా రాష్ట్రాల్లో ఒకటి, రెండు రోజులకు సరిపడే, అది కూడా పరిమితంగానే టీకా నిల్వలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీకా ఉత్సవ్ ను నిర్వహించే అవకాశాలు లేవని పలు రాష్ట్రాలు అంటున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఇప్పుడున్న టీకా వయల్స్ సంఖ్య కేవలం 1.35 లక్షలు మాత్రమే. టీకా ఉత్సవ్‌ను ప్రారంభిస్తే, అవి ఒక్కరోజుకు కూడా సరిపడవు. ఈ నాలుగు రోజుల వ్యవధిలో కనీసం 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని అధికారులు నిర్ణయించగా, తదుపరి వ్యాక్సిన్ నిల్వలు 15వ తేదీ వరకూ రాష్ట్రానికి అందే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో టీకా ఉత్సవాన్ని నిర్వహించలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. టీకా నిల్వలు వారం రోజులకు సరిపడా ఉన్నప్పటికీ, అవి టీకా ఉత్సవాన్ని నిర్వహించేందుకు సరిపడబోవని అధికారులు అంటున్నారు. కనీసం మరో 20 లక్షల డోస్ లు రాష్ట్రానికి వస్తేనే అర్హులైన వారందరికీ టీకాను ఇవ్వడానికి వీలవుతుందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాలు తమ వద్ద టీకా ఉత్సవాన్ని నిర్వహించేందుకు సరిపడా వయల్స్ లేవని, వెంటనే పంపితేనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగలమని కేంద్రానికి స్పష్టం చేశాయి. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని వెల్లడించాయి. అర్హులైన వారంతా తమకు దగ్గర్లోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వచ్చి టీకాను తీసుకోవచ్చని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అటు టీకా సరఫరా సక్రమంగా లేదని, దేశంలో అవసరాలు తీర్చకుండా విదేశాలకు ఎగుమతి చేసి, ఇప్పుడు కొరతను తీసుకుని వచ్చారని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీకాను ఇండియాలోని ప్రజలకు పంచకుండా, ఎక్స్ పోర్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ముందుచూపు లేకుండా టీకా ఉత్సవం పేరిట మరోసారి ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement