Thursday, December 5, 2024

టీడీపీ నేతలపై ఎందుకు కక్షసాధింపు?

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సంఘం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. అక్రమ అరెస్టును ఆపార్టీ నేతలు ఖండించారు. ధూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సంగం డైరీని దెబ్బతీసి అమూల్‌ కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్‌ తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేదు కానీ.. అక్రమ అరెస్ట్‌లు మాత్రం ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా నియంత్రణలో విఫలమమైన జగన్ సర్కార్.. ప్రజలను పక్కదారి పట్టించడానికే టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్ట్‌లు చేయించుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరని జగన్ రెడ్డి గుర్తించాలని చంద్రబాబు పేర్కొన్నారు.  ప్రజా సమస్యలు బయటకు వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా వంటి నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

కాగా, ధూళిపాళ్ల నరేంద్రను ఈ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

ధూళిపాళ్ల అరెస్టుపై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు కూడా మండిప‌డ్డారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేసిన‌ ధూళిపాళ్ల‌ నరేంద్ర అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కరోనా వ్యాప్తి వేళ బాధితులు బెడ్లు ఇప్పించమని వేడుకుంటుంటే, వారిని పట్టించుకోని ప్రభుత్వం త‌మ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంద‌ని విమర్శించారు. వందల మంది పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య‌ అని మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement