Saturday, April 27, 2024

Spl Story | వార్​జోన్​ను తలపించిన ఆస్పత్రులు.. కారిడార్ల నిండా క్షతగాత్రులు

స్ట్రెచర్లపై పడుకున్న క్షతగాత్రులతో అక్కడి కారిడార్లు నిండిపోయాయి.. స్పెషల్​ రూమ్స్​ అన్నీ గాయపడిన ప్రయాణికుల ఆర్థనాదాలతో మారుమోగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఇలా అంతులేని ప్రవాహంలా ఆస్పత్రికి తరలి వస్తూనే ఉన్నారు. ఇది ఒడిశాలోని బాలాసోర్‌ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో శనివారం కనిపించిన దృశ్యం. వార్ జోన్‌లోని వైద్య సదుపాయం ఎలా ఉంటుందో.. బాలాసోర్​లో ఆస్పత్రుల పరిస్థితి అలా ఉంది. శుక్రవారం రాత్రి బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 288 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. చాలా మంది క్షతగాత్రులను బాలాసోర్​లోని ఆస్పత్రులకు తరలించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

అనూహ్యమైన గందరగోళం మధ్య వైద్య సిబ్బంది, ఎమర్జెన్సీ సిబ్బంది క్షతగాత్రుల ప్రాణాలను కాపాడడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇది యుద్ధ సమయంలో పోరాటం మాదిరిగానే కనిపిస్తోంది. ఇప్పుడు ఆ ఆస్పత్రులు ఓ వార్​ జోన్​గా మారాయి. శుక్రవారం నాటి ప్రమాదంలో 520 మందికి పైగా బాధితులు బాలాసోర్ జిల్లా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

గాయపడిన బాధితులను అత్యవసర వైద్య సహాయం కోసం బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రమాద తీవ్రతను చూసి.. సిబ్బంది సదుపాయాన్ని యుద్ధ-ప్రాంత వైద్య సదుపాయంగా మార్చారు. ఇక్కడ గాయపడినవారు ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాడారు. వైద్య సిబ్బంది సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను రక్షించడానికి శతవిధాలా కృషి చేశారు. అయితే.. ఎక్కువ మంది గాయపడిన వారిని తీసుకురావడంతో పడకలు అప్పటికప్పుడు అడ్జస్ట్​ చేయాల్సి వచ్చింది.

- Advertisement -

క్షతగాత్రులను బాలాసోర్, సోరో, భద్రక్, జాజ్‌పూర్‌లోని హిస్పటళ్లతోపాటు కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీకి తరలించారు. బాలాసోర్ జిల్లా ఆసుపత్రిలో గాయపడిన ప్రయాణికుల తాకిడి  పెద్ద ఎత్తున ఉంది. ఈ సందర్భంగా బాలాసోర్​ జిల్లా వైద్య అధికారి మీడియాతో మాట్లాడారు.

నేను చాలా కాలంగా ఇదే వృత్తిలో ఉన్నాను. కానీ నా జీవితంలో ఇంత గందరగోళాన్ని ఎప్పుడూ చూడలేదు. – అకస్మాత్తుగా 251 మంది గాయపడిన వారిని మా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి మేము సిద్ధంగా లేము. మా సిబ్బంది రాత్రంతా పని చేశారు. అయినా అందరూ ఈ ప్రమాదాన్ని గమనించి పనిచేయడానికి ముందుకొచ్చారు. ఆస్పత్రికి వచ్చిన వారందరికీ ప్రథమ చికిత్స అందించారు అని బాలాసోర్ జిల్లా ప్రధాన ఆస్పత్రి అదనపు జిల్లా వైద్య అధికారి (ADMO) డాక్టర్ మృత్యుంజయ్ మిశ్రా చెప్పారు. స్వల్ప గాయాలతో కొంతమంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని, 60 మందికి పడకలు కేటాయించామని చెప్పారు. కొంతమంది క్రిటికల్​గా ఉన్న వారిని కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రెఫర్ చేశారు.

కాగా, అధిక సంఖ్యలో యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు రావడంతో మేము ఆశ్చర్యపోయాము.  మేము రాత్రిపూట 500 యూనిట్ల రక్తాన్ని సేకరించాము. ఇది జీవితకాల అనుభవం. ఇప్పుడు ఈ విషయాలు చాలా సాధారణమైనవి  అని ADMO అన్నారు.

బాలాసోర్ కు మరింత మంది డాక్టర్లు..

రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలలో పాల్గొనేందుకు భువనేశ్వర్ ఎయిమ్స్-నుండి వైద్యులను ఒడిశాలోని బాలాసోర్, కటక్‌లకు పంపినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఢీకొన్న ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి బంధువుల కోసం వెతకడానికి పశ్చిమ బెంగాల్ నుండి చాలా మంది ప్రజలు బాలాసోర్ ఆసుపత్రికి తరలివస్తున్నారు.

రక్తదానం చేయడానికి తరలివచ్చిన జనం..

రైలు ప్రమాదంలో కాళ్లు, చేతులు తెగిపోయి, తీవ్ర గాయాలతో ఆస్పత్రికి వచ్చిన వారికి రక్తం కావాల్సి వచ్చింది. ఆ అవసరాన్ని గుర్తించి బాలాసోర్ జిల్లా ఆసుపత్రి, ఇతర ఆసుపత్రులలో రాత్రిపూట రక్తదానం చేయడానికి పోలీసు సిబ్బంది.. స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇది అందరిలో బాధ్యతను గుర్తుచేసిన ఘటనగా చెప్పుకోవాలి.  క్షతగాత్రులకు సాయం చేసేందుకు బాలాసోర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో రాత్రి 2,000 మందికి పైగా ప్రజలు గుమిగూడారు. ఈ క్రమంలో పలువురు రక్తదానం చేశారు. అనేక రైళ్లు రద్దు కావడం.. ఆలస్యం కావడంతో మృతుల బంధువులు బాలాసోర్ చేరుకోలేదు. ఇక అక్కడి ప్రదేశమంతా తెల్లటి కప్పబడిన మృతదేహాల కుప్పగా మారిపోయింది. ఆ డెడ్​బాడీస్​లో చాలా వరకు ఇంకా గుర్తించలేదు.

  • ప్రమాదంలో గాయపడి బాలాసోర్ ఆసుపత్రిలో చేరిన వారు ఆ ఘోరమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. రెండు చేతులకు ఫ్రాక్చర్‌తో ఆసుపత్రిలో చేరిన జగదేబ్ పాత్రా చెన్నైకి ప్రయాణిస్తున్నట్లు చెప్పాడు.
  • జార్ఖండ్‌కు చెందిన మరో ప్రయాణికుడు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లో  చెన్నైకి వెళ్తున్నాడు. తన పేరు ముఖేష్ పండిట్ అని తెలిపాడు. ప్రమాదం ఎప్పుడు జరిగిందో తనకు తెలియదని, ఒకరిపై ఒకరు పడిపోయిన తర్వాత ప్రాణాలతో బయటపడ్డానని చెప్పాడు. చాలా సేపటి తర్వాత తను స్పృహలోకి వచ్చాడు.
  • అంతకుముందు ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ.. తాను రైలు నుండి దిగినప్పుడు అక్కడో చేయి, ఇక్కడో కాలు.. ఇతర అవయవాలు పడిపోయి ఉన్నాయని, బాడీ పార్ట్స్​ లేని వ్యక్తులను చూశానని చెప్పాడు. ప్రమాదం జరిగినప్పుడు జరిగిన భయానక క్షణాన్ని వివరించాడు.
  • ప్రమాదం జరిగినప్పుడు నేను నిద్రపోతున్నాను. పెద్దపెద శబ్దాలు కావడంతో మేల్కొన్నాను, కళ్లు తెరిచి చూసేసరికి సుమారు 10 నుండి 15 మంది వ్యక్తులు నాపై పడిపోయి ఉన్నారు. నాకు చేయి, తలకు గాయమైంది. నేను బోగీ నుండి బయటకు వచ్చినప్పుడు కాళ్లు, చేతులు తెగిపడిపోయిన చాలా మందిని చూశాను అని చెప్పాడు.
Advertisement

తాజా వార్తలు

Advertisement