Friday, March 29, 2024

Big story | మార్కెట్లోకి నకిలీ విత్తనాలు.. టాస్క్‌ఫోర్స్‌ నిఘా

అమరావతి, ఆంధ్రప్రభ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాకముందే నకిలీ విత్తనాలు మార్కెట్లో ముందస్తుగా ముంచెత్తుతున్నాయి. కల్తీలూ, నకిలీలు, బ్లాక్‌ మార్కెటింగ్‌ ను కట్టడి చేసేందుకు టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు చేస్తున్న దాడుల్లో నకిలీలు బయటపడుతున్నాయి. నెల్లూరు, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టు సమాచారం అందటంతో అధికారులు దాడులు చేస్తున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలోని నకిలీ విత్తనాలను గుర్తించి వాటిని విక్రయిస్తున్న దుకాణాలను సీజ్‌ చేశారు. ఈ దాడుల్లో 911 కిలోల పత్తి, మిరప నకిలీ విత్తనాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న దుకాణాలకు స్టాప్‌ సేల్‌ నోటీసులు కూడా ఇచ్చారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లోనూ నకిలీ విత్తనాలపై అధికారులు నిఘా ఉంచారు.

నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే నకిలీ విత్తనాలు వినియోగించి రైతులు నష్టపోయినట్టు గుర్తించారు. ఈ మేరకు టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. ఖరీఫ్‌ సీజన్‌ లో నకిలీలు, బ్లాక్‌ మార్కెట్‌ నియంత్రించటమే లక్ష్యంగా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీలు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించటం ద్వారా అధిక ధరలకు విక్రయించే మార్కెట్‌ మోసాలపైనా కమిటీలు దృష్టి సారించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీకి విత్తనాలు పంపిణీ చేస్తోంది.

ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు సరిపోక రైతులు బహిరంగ మార్కెట్‌ పై ఆధారపడతారు. దీన్ని ఆధారంగా చేసుకుని డిమాండ్‌ ఉన్న విత్తనాల అధిక ధరలకు విక్రయించటంతో పాటు నకిలీలను కూడా కొందరు దుకాణదారులు ప్రోత్సహిస్తుండటతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో కూడిన టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు విస్తృతంగా తనిఖీలు చేపట్టి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది.

- Advertisement -

షేడ్‌ నెట్స్‌ పై నిఘా

నకిలీ విత్తనాలతో పాటు నకిలీ నారు కట్టడిపై టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు దృష్టి సారించాయి. మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనాలను అనేక మంది నారు కోసం షేడ్‌ నెట్స్‌ కు ఇస్తుంటారు. ఇపుడు నర్సరీలతో పాటు- షేడ్‌ నెట్స్‌ కూడా ప్రభుత్వం నర్సరీ యాక్టు పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు షెడ్‌ నెట్స్‌ కూడా సీడ్‌ రిజిస్టర్లను నిర్వహించాల్సి ఉంటుంది. లాట్‌ నెంబర్లతో సహా నారుకు ఉపయోగించిన విత్తనం కంపెనీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో షేడ్‌ నెట్స్‌ వద్ద నకిలీలకు అవకాశమే లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. నారు తయారీకి నాణ్యమైన విత్తనాలు వినియోగించలేదని తనిఖీల్లో తేలితే ఆయా షేడ్‌ నెట్స్‌ లైసెన్సులను కూడా రద్దు చేసే అవకాశముంది.

మిర్చి విత్తనాలపై ఫోకస్‌

నకిలీ, నాసిరకం విత్తనాల బెడద అన్ని పంటల కన్నా మిరప సాగుపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ప్రతి సాగు విస్తీర్ణం పెరగుతుండటం వల్ల డిమాండ్‌ అధికం కావటంతో ఇదే అదనుగా మార్కెట్‌ మోసాలు పెరిగిపోతుతున్నాయి. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం బ్రాండెడ్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటోది. ఈ ఏడాది ఖరీఫ్‌ లో మిరపసాగు 6 లక్షల ఎకరాలకు చేరువయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఆర్బీకేల ద్వారా అగ్రిల్యాబుల్లో నాణ్యతా పరీక్షలు చేసిన అనంతరం గత ఏడాది 9 వేల ప్యాకెట్లను సబ్సిడీపై విక్రయించగా ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం పెంపుదలను దృష్టిలో ఉంచుకుని అంతకంటే ఎక్కువగా విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement