Monday, April 29, 2024

రాష్ట్రమంతా ఇరిగేటెడ్‌ కమాండ్‌ ఏరియా.. వాగుల పునర్జీవానికి చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని అన్ని ప్రధాన వాగులు, వంకలను పునర్జీవింప చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు అనేక పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తవుతుండడంతో దాదాపు రాష్ట్రమంతటినీ ఇరిగేటెడ్‌ కమాండ్‌ ఏరియాగా మార్చాలని నిర్ణయించారు. రానున్న రెండేళ్లలో వాగులు, వంకల పునర్జీవ కార్యక్రమాన్ని 100శాతం పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదలశాఖకు లక్ష్యం విధించారు. వాగుల పునర్జీవ పథకంలో భాగంగా… ముందుగా ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. ఆయకట్టు పొలాల నుంచి వచ్చే నీరు (పడవాటి) నీరు వృథాగా పోకుండా తిరిగి వాగుల్లో చేరేవిధంగా చర్యలు తీసుకుంటారు. దీంతో వాగులు పునర్జీవం చెంది భూగర్భ జలాలు రీచార్జ్‌ కావటంతోపాటు అనేక రకాలుగా గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలకు వినియోగం కానున్నాయి.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వాగుల పునర్జీవంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇప్పటికే విస్తృత అధ్యయనాన్ని నిర్వహించింది. సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాపులతోపాటు నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ ఉపగ్రహ చిత్రాల సహకారం కూడా తీసుకుంది. ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానానికి ఉన్న అవకాశాలను మ్యాప్‌ చేసి క్షేత్రస్థాయిలోని సాగునీటిశాఖ ఇంజనీర్లకు అందజేశారు. ప్రతీ మండలానికి ఒక ఇరిగేషన్‌ చిత్రపటాన్ని రూపొందించి క్షేత్రస్థాయి ఇంజనీర్లకు అప్పజెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రం లోని నదులన్నింటిని 8 స్థాయిల్లో వర్గీకరించారు. 4 నుంచి 8 నీటి ప్రవాహాలు కలిసే వాగును పెద్దవాగుగా పరిగణిస్తున్నారు.ఇలాంటివి రాష్ట్రంలో 683 ఉండగా… వాటి పొడవు 12, 183 కిలోమీటర్లు ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. వీటిపై అనువైనచోట్ల చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 1200 చెక్‌ డ్యాంలను నిర్మించగా మరో 3వేల చెక్‌ డ్యాంలను రానున్న ఒకటి, రెండేళ్లలో నిర్మించనున్నారు.

వాగుల్లో ఏడాదిపాటు అందుబాటులో నీరు: – శ్యాంప్రసాద్‌రెడ్డి, తెలంగాణ నీటిపారుదలశాఖ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు.
నీరును ఎక్కడికక్కడ నిల్వ చేసుకోగలిగితే ఆ ప్రాంతాల్లోని వాగులు పునర్జీవం చెందుతాయని తెలంగాణ రిటైర్డ్‌ ఇరిగేషన్‌ ఇంజీనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వాగుల్లో ఏడాదిపాటు నీరు అందుబాటులో ఉంటుంది. అది గ్రామీణ ప్రజల పలు అవసరాలకు ఉపయోగ పడటంతోపాటు సమీపంలోని బావులు, బోర్లలో భూగర్భ జల మట్టం పెరుగుతంది. కమాండ్‌ ఏరియా ప్రొగ్రాం లేకపోతే పొలాల నుంచి వచ్చే పడవాటి నీరు పెద్ద మొత్తంలో వృథా అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు సాగునీటి ప్రాజెక్టులు పూర్తయినందున సరైన సమయంలో పడవాటి నీటి సద్వినియోగంతో వాగుల పునర్జీవన పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

Advertisement

తాజా వార్తలు

Advertisement