Friday, May 3, 2024

Star Campaigner – అన్ని తానై క‌ద‌న‌రంగంలోకి యువ‌నేత .. ఇక జిల్లాల‌లో ప‌ర్య‌ట‌న‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ యువనేత, మంత్రి కేటీ రామారావు తన వ్యూహాత్మక కార్యాచరణను అమల్లోకి తీసుకురాబోతున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో అన్నీ తానై ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల మొదటివారం నుంచి కేటీఆర్‌ జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. క్యాడర్‌ను బలో పేతం చేయడంతో పాటు రాజకీయాలపై యువకులు, విద్యార్థుల్లో ఉన్న అభిప్రాయాలను సేకరించి ముందుకు సాగాలని నిర్ణయించారు. రాష్టవ్యాప్తంగా ప్రతి అసెంబ్లి నియోజకవర్గంలోనూ పర్యటించి యువతను మేల్కొల్పడమే లక్ష్యంగా కేటీఆర్‌ పర్యటనలుంటా యని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ప్రైవేటు విద్యా సంస్థలు వేదికగా విద్యార్థి సమ్మేళనాలు నిర్వహించ నున్నారు. రాష్ట్రాభివృద్ధికి భవిష్యత్‌ ప్రణాళిక, రాజకీయాల్లో నూతనోత్తేజంపై తన గొంతుకను క్షేత్రస్థాయికి వినిపించనున్నారు. మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే ధ్యేయంగా సాగనున్న యువనేత పర్యటనల్లో బీఆర్‌ఎస్‌ యంత్రాంగ మంతా ఆయన వెంటే ఉండి ప్రతి కార్యక్రమాన్ని విజయ వంతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధమైంది. అకుంఠిత దీక్షతో, పట్టుదలతో పనిచేసే కేటీఆర్‌ అన్నీ తానై ముందడుగు వేయబోతున్నారు. అయితే, గతంలో మాదిరి కాకుండా ఈ సారి ఎన్నికల్లో యువజన ఓటర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రైతుబంధు, పెన్షన్లు, ఇళ్ళ పట్టాలు, పోడు పట్టాలు, దళిత బంధు, కుల వృత్తుల ప్రోత్సాహకాలు.. లాంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య దాదాపు కోటికి చేరువలో ఉన్నారు. ఈ ఓట్లు ఎలాగూ తమకే వస్తాయన్న ధీమా పార్టీ వర్గాల్లో గట్టిగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కీలకమైన యువజనుల ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ కార్యాచరణను అమల్లోకి తీసుకు రానుంది.

అందులో భాగంగా వచ్చే నెల మొదలుకుని ప్రత్యేకంగా విద్యార్థి, యువజనులను ఆకర్షించేందుకు పార్టీ సమాయత్తమవుతోంది. అందుకోసం విద్యాసంస్థల్లో విద్యార్థి సమ్మేళనాలు, గ్రామాల్లో, వీధుల్లో, బస్తీల్లో యువ సమ్మేళనాలు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారు. కేవలం విద్యార్థులు, యువజనుల నుంచి 10లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా కేటీఆర్‌ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందుకోసం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతి జిల్లాకో లక్ష చొప్పున టార్గెట్‌ విధించి బీఆర్‌ఎస్‌ యువ మంత్రం విజయవంతం చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ఇక కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో క్షేత్ర స్థాయిలో పార్టీపరంగా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు ప్రతీ నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించి ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరిచారు.

ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్రంలో దాదాపు 63 లక్షల మంది రిజిస్టర్డ్‌ సభ్యులు ఉన్నారు. కాగా, వీరిలో 35 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వీరితో పోలిస్తే 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు 25 శాతం తక్కువగా ఉన్నారు. పార్టీ పరంగా ఈ ఏజ్‌ గ్రూప్‌ సభ్యత్వాలను పెంచాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. అధినేత సూచనల మేరకు త్వరలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ మెగా యూత్‌ మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం పార్టీ పరంగా అన్ని స్థాయిల్లో నాయకులు, కార్యకర్తలు రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి విద్యార్థులు, యువతను ఆహ్వానిస్తూ.. భారీగా పార్టీ సభ్యులుగా చేర్పించడమే కాకుండా.. ప్రభుత్వ విజయాలను, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించనున్నారు. తెెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 10 నుంచి 17 ఏళ్ల వయసులో ఉన్న వారికి ఇప్పుడు ఓటు- హక్కు వచ్చి ఉంటు-ంది. వారిలో కొంత మంది 2018 ఎన్నికల్లో ఓటేసి ఉంటారు. కానీ, ఇప్పుడు ఆ వర్గమంతా బీఆర్‌ఎస్‌కు ఓటేసేలా చూసే బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఇంచార్జులకు, కార్యకర్తలకు అప్పగించనున్నారు.

- Advertisement -

కేవలం సభ్యులుగా నమోదు చేయడమే కాకుండా.. యువ ఓటర్లను బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపే బాధ్యతను కూడా అప్పగిస్తారు. నియోజకవర్గాల వారిగా కొత్త ఓటర్లను గుర్తించి.. వారి కోసం ప్రత్యేక ప్రణాళికను కూడా సిద్ధం చేయనున్నారు. 9 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు, ప్రైవేటు- రంగంలో వచ్చిన ఉద్యోగాలు భారీగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా 2.3 లక్షలు, ప్రైవేటు- రంగంలో 17 లక్షల మేర ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. వీటన్నింటినీ యువతకు వివరించాలని, తద్వారా వారు బీఆర్‌ఎస్‌కు ఓటేసేలా చూడాలని పార్టీ లక్ష్యంగా పెట్టు-కున్నది. ఇందుకు యూత్‌ మెగా మెంబర్‌షిప్‌ డ్రైవ్‌, యువ సమ్మేళనాలను వేదికగా చేసుకోవాలని పార్టీ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement