Sunday, May 12, 2024

విశాఖ‌కు ఆధ్యాత్మిక శోభ‌.. వేంక‌టేశ్వ‌ర స్వామి నూత‌న ఆల‌యంలో మ‌హా కుంభాభిషేకం

విశాఖ‌లో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా మహా కుంభాభిషేకం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర‌ సరస్వతి స్వామి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారు అనుగ్రహభాషణం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కోరిక మేరకు, టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి ఆలయం విశాఖలో నిర్మించినట్లు తెలిపారు. వైఖానస ఆగమానుసారం శ్రీవారి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్న తిరిగి వచ్చాడా అన్నంత‌ అద్భుతంగా ఉందన్నారు. వేదాలు, ఆగమాలు, దేవాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని చెప్పారు. ధ్వజస్తంభం సమస్త జీవులకు, ఆలయానికి వెన్నెముక‌ వంటిద‌న్నారు. ముఖమండపం స్థూలశరీరం, అర్ధ మండపం సూక్ష్మ శరీరం, గర్భాలయం హృదయం వంటిదన్నారు. గర్భాలయంలోని స్వామివారిని దర్శిస్తే సమస్త పాపాలు తొలగి, కోరిన కోర్కెలు నెరవేరుతాయని వివరించారు. విశాఖ శారదా పీఠం లోకంలోని సమస్త జీవులు సుభిక్షంగా ఉండాలని, సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు పనిచేస్తోందన్నారు. శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిల్లలకు విద్యాబుద్ధులు, పెద్ద ప‌రిశ్ర‌మ‌లు రావడం ద్వారా యువత ఉపాధి అవ‌కాశాలతో ఎదగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

అనంత‌రం టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ‌కు మ‌రింత ఆధ్యాత్మిక శోభ క‌ల్పించేందుకు రెండు సంవ‌త్స‌రాల క్రితం రూ.26 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. మార్చి 18వ తేదీన అంకురార్పణతో ప్రారంభించి ఐదు రోజుల పాటు రుత్వికులు వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఒడిశాలో శ్రీవారి ఆలయం పూర్తయిందని, రాబోయే రెండు నెలల్లో ఆలయం ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో కూడా శ్రీవారి ఆలయం పూర్తిచేసి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

కాశ్మీర్‌లో 60 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మ‌త్స‌కార‌, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్లలో 1000 శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు విశాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ‌వ‌ల‌సిన రోజ‌న్నారు. తిరుమల నుండి స్వామివారు మ‌నంద‌రినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారన్నారు. విష్ణుమూర్తికి సముద్రం అంటే ఇష్టమని, విశాఖ సముద్రతీరంలో శ్రీవారి ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. శ్రీ వారి అనుగ్రహంతో విశాఖ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement