Thursday, May 2, 2024

గో సంరక్షణకు ప్రత్యేక చట్టం.. ఉత్తరప్రదేశ్​లో అక్రమ కబేళాల మూసివేత​

పశువుల సంరక్షణకు ఉత్తర ప్రదేశ్​ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. దీనికోసం ముందస్తు కార్యాచరణ ప్రారంభించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ తెలిపారు. కాగా, మార్చి 10 తర్వాత ఆరు బయట విచ్చలవిడిగా తిరిగే పశువులను కట్టడి చేసేందుకు కొత్త పాలసీని తీసుకొస్తామని ఈ మధ్య జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అయితే ఈ సమస్య కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 44 జిల్లాలు ఆరు బయట తిరిగే పశువులు లేని జిల్లాలుగా గుర్తింపు పొందాయని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వెల్లడించింది.

మండీ పరిషత్‌కు వచ్చే ఆదాయంలో 3 శాతాన్ని సెస్‌గా గో సేవా ఆయోగ్ ద్వారా నమోదు చేసుకున్న గోశాలలో వదిలేసిన పశువుల సంక్షేమానికి ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక్కడ విశేషమేమిటంటే ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న 572 గోశాలలు ఉత్తరప్రదేశ్ గోశాల చట్టం కింద నమోదయ్యాయని, వాటిలో 394 క్రియాశీలకంగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 45 నమోదిత గోశాలలకు రూ.20 కోట్లు కేటాయించినట్టు సీఎం యోగి తెలిపారు.

మరోవైపు, రోడ్లమీద తిరిగే జంతువులకు ఆహారం అందించేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్లకు రూ.474 కోట్లు కేటాయించినట్లు సీఎం యోగి తెలిపారు. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో పశుసంవర్ధక శాఖ నోడల్ అధికారులు నిత్యం పర్యటిస్తూ గోశాలలను పర్యవేక్షిస్తూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారని యూపీ సర్కారు తెలిపింది.  గత ఆదివారం ఉన్నావ్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బహిరంగంగా తిరిగే పశువుల సమస్య పరిష్కారానికి కొత్త ఏర్పాటు చేస్తామని చెప్పారు. “ప్రజలు ఆవు పేడతో సంపాదించగలిగేలా నేను కొత్త వ్యవస్థను తీసుకువస్తాను” అని ప్రధాని ప్రతిజ్ఞ చేశారు.

కాగా, మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్రమ కబేళాలను పూర్తిగా మూసివేశారని, 9 లక్షలకు పైగా బహిరంగంగా తిరిగే పశువులు షెల్టర్లలో ఉన్నాయని స్పష్టం చేశారు. సహజ వ్యవసాయాన్ని విస్తృతం చేయడం ద్వారా రైతుల పొలాలను ఆవులు, ఎద్దుల నుండి కాపాడుతామన్నారు. రైతుల ప్రయోజనాల కోసం విచ్చలవిడి పశువులను ఉపయోగించుకుంటామని, ఇందుకోసం బడ్జెట్‌లో ఇప్పటికే కేటాయింపులు చేశామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement