Thursday, May 2, 2024

Big Story: పూడిక ఎక్కువైంది, నీళ్లు సాల్తలేవ్​.. దిగువ రాష్ట్రాల నీటిని వాడేస్తూ సాకులు

కృష్ణా న‌దిలో నీరు పారాలంటే క‌ర్నాట‌క మీదుగా దిగువ‌కు రావాల్సిందే. అటు మ‌హారాష్ట్ర నుంచి అయినా, ఇటు క‌ర్నాట‌కు నుంచి అయినా.. కృష్ణాలో మ‌న ద‌గ్గ‌ర నీళ్లా పారాలంటే ఎగువ‌న ఉన్న క‌ర్నాట‌కు దాటుకుని రావాల్సిందే.. అయితే.. ఎగువ‌న దిగువ రాష్ట్రాల నీటి వాటాల‌ను అద‌నంగా వాడేస్తున్న క‌ర్నాట‌క‌.. తుంగ‌భ‌ద్ర‌లో పూడిక మేట‌లు పెరిగాయ‌ని, అందుకే నీళ్లు స‌రిపోక వాడేస్తున్నామ‌ని కుంటిసాకులు చెబుతోంది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు ఎగువన కర్ణాటక రాష్ట్రం గండి కొడుతోంది. తుంగభద్ర నది జలాల్లో కేటాయింపులను మించి వాడుకుంటోంది. తెలుగు రాష్ట్రాలు … తెలంగాణ, ఏపీ నీటి కేటాయింపులను కూడా ఆయకట్టుకు తరలించుకుపోతోంది. స్వాతంత్య్రానికి పూర్వమే అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రం మద్రాసు రాష్ట్రంతో ఒప్పందం చేసుకుని 1943లో కర్ణాటకలోని హోస్పేట వద్ద తుంగభద్ర నదిపై ప్రాజెక్టును నిర్మించింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఈ రిజర్వాయర్‌ కొనసాగుతోంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తుంగభద్ర ప్రాజెక్టుకు 230 టీఎంసీల నీటిని కేటాయించింది. ఇందులో తెలంగాణకు 15.90 టీఎంసీలు, ఏపీకి 102 టీఎంసీల నీటిని కేటాయించింది. అయితే జలాశయంలో పూడిక పేరుకుపోయిందని, వరద తక్కువగా వస్తోందన్న నెపంతో కర్ణాటక తెలుగు రాష్ట్రాలకు వదలాల్సిన నీటిని కూడా అక్కడి ఆయకట్టుకే తరలిస్తోంది. 133 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టులో ఇప్పుడు 100 కంటే తక్కువ టీఎంసీల నీటినే నిల్వ చేయగలుగుతున్నామని కర్ణాటక ఇరిగేషన్‌ అధికారులు తుంభద్రానదీ యాజమాన్య బోర్డుకు స్పష్టం చేస్తున్నారు.

ఏకంగా 30 టీఎంసీల మేర నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందన్న కారణంతో… తెలంగాణకు వదలాల్సిన 15.9 టీఎంసీల్లో కేవలం 6 టీఎంసీల వరకే దిగువకు వదులుతోంది. ఆ నీరు రాజోలి బండ డైవర్షన్‌ స్కీం పథకం ద్వారానే తెలంగాణలోకి ప్రవేశించాలి. అయితే ఏ సీజన్‌లో తీసుకున్నా తుంగభద్ర ద్వారా తెలంగాణ పరిధిలోని ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 6 టీఎంసీలకు మించి నీరు అందడం లేదని తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ రికార్డులు చెబుతున్నాయి. ప్రాజెక్టులో పూడిక పేరుతో తెలంగాణ రాష్ట్ర నీటి వాటాకు గండిపెడుతున్న కర్ణాటక తీరుపై తుంగభద్రా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ భావిస్తోంది.

తుంగ భద్రకు కొనసాగుతున్న వరద
ఎగువన వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్రా నదీకి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2512 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దాదాపు 276 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా… ప్రస్తుతం 1612.48 అడుగులుగా కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement