Monday, April 29, 2024

చ‌ట్టం చేస్తూ సంత‌కం.. అదే చ‌ట్టం వ‌ద్దంటూ మరో సంత‌కం.. రాష్ట్ర‌ప‌తికి స‌రికొత్త అనుభ‌వం!

సాగు చ‌ట్టాలు ఎలా వ‌చ్చాయో అలానే పోయాయి. సో్మ‌వారం పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో ఆ మూడు సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ బిల్లు ఆమోదించారు. మొత్తంమీద ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ దేశ రైతుల‌కు ఇచ్చిన హామీని అయితే నెర‌వేర్చారు. అయినా అటు రైతులు గాని, ఇటు ప్ర‌తిప‌క్ష పార్ల‌మెంట్ స‌భ్యులు గాని ఏమాత్రం సంతృప్తి చెంద‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఆరోజు సాగు చ‌ట్టాల‌ను ఆమోదించిన రోజు ఏమి జ‌రిగిందో ఇప్పుడు వాటిని ర‌ద్దు చేసిన స‌మ‌యంలోనూ అలానే జ‌రిగింది. ఏదైనా బిల్లుని పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు దానిమీద చ‌ర్చ జ‌రుగుతుంది. అవ‌స‌ర‌మైన ప‌క్షంలో మార్పులు చేర్పులు జ‌రుగుతాయి. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాల అభిప్రాయాలు క్రోడీక‌రించ‌డం జ‌రుగుతుంది. కాని సోమ‌వారం లోక్‌స‌భ‌లో మూడు సాగు చట్టాల ర‌ద్దు బిల్లు మీద అదేమీ జ‌ర‌గ‌లేదు.

ఒక‌వంక ప్ర‌తిప‌క్షంలోని వివిధ ప‌క్షాలు త‌మ‌త‌మ డిమాండ్ల మీద ప‌ట్టుబ‌డుతూ లోక్‌స‌భ వెల్ లోకి దూసుకుపోయిన నేప‌థ్యంలో స‌భ‌లో గంద‌ర‌గోళ‌ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆ ప‌రిస్థితుల్లోనే ప్ర‌తిప‌క్షాలు ఈ బిల్లు మీద చ‌ర్చ జ‌ర‌పాల‌ని నిన‌దించారు. స‌భ్యులంతా వెళ్లి త‌మ సీట్లలో కూర్చుంటే చ‌ర్చ‌కు అనుమ‌తిస్తాన‌ని ఒక‌టికి రెండుసార్లు ప్ర‌క‌టించారు. అయినా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు విన‌లేదు. దాంతో స్పీక‌ర్ ఆ బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదించిన‌ట్టు ప్ర‌క‌టించారు. దీనిమీద ప్ర‌తిప‌క్షాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. స‌భ‌లో చ‌ర్చ లేకుండా బిల్లుని ఎలా ఆమోదిస్తార‌ని స‌భ వెలుప‌ల కూడా ప్ర‌శ్నిస్తున్నాయి. నిజానికి ఆ మూడు సాగు చ‌ట్టాలు వివాదాస్ప‌ద‌మైన నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ జాతికి క్ష‌మాప‌ణ చెప్పి, వాటిని ఉప‌సంహ‌రిస్తున్న‌ట్టు ఇటీవ‌లే ప్ర‌క‌టించారు.

ఇందుకు ప్ర‌తిప‌క్షాలు హ‌ర్షం కూడా వ్య‌క్తం చేశాయి. ఈ బిల్లుని ర‌ద్దు చేసే విష‌యంలో ఎవ్వ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేదు గాబ‌ట్టి దీనిమీద చ‌ర్చ‌కు ఆస్కారం లేద‌ని ప్ర‌భుత్వం భావించిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. అదీగాక స‌భ‌లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఉండిఉంటే స్పీక‌ర్ చ‌ర్చ‌కు అనుమ‌తించి ఉండేవారేమో తెలీదు. ఇక ప్ర‌తిప‌క్షాల వాద‌న‌కు వ‌స్తే.. ఆ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డంతోనే స‌రిపోద‌ని, ఏడాదిన్న‌ర‌గా సాగిన రైతు ఉద్య‌మంలో చ‌నిపోయిన రైతు కుటుంబాల ప‌రిస్థితిని, ల‌ఖింపూర్ ఖేరిలో కారు తొక్కిస‌లాట ఉదంతాన్ని, అలాగే మ‌ద్ద‌తు ధ‌ర విష‌యాన్ని తేల్చాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి. చ‌ర్చ జ‌రిగిఉంటే ఈ అంశాల‌న్నింటి మీద ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని ప్ర‌తిప‌క్షాలు భావించాయి. ప్ర‌భుత్వం కూడా ఈ ప‌రిస్థితిని నివారించాల‌న్న ఆలోచ‌న‌లోనే ఉండ‌టం..అందుకు స‌భ‌లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌డంతో ఇక ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఆ బిల్లుని మోజువాణి ఓటుతో ఆమోదింప‌చేశారు. 

అయితే ఇది ఇంత‌టితోనే అయిపోయింద‌నుకోవ‌డానికి వీల్లేదు. మంగ‌ళ‌వారం స‌భ‌ల్లో ప్ర‌తిప‌క్షాలు ఇదే అంశాన్ని లేవ‌నెత్తే ప్ర‌య‌త్నం చేస్తాయి. మ‌ళ్లీ య‌ధాప్ర‌కారం వాయిదాలు..మొత్తం మీద ప్ర‌ధాని మోడీ తాను ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. ఆ మూడు సాగు చ‌ట్టాల‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేస్తున్నామ‌న్నారు. చ‌ట్ట‌బ‌ద్ద‌మైన ప్ర‌క్రియ‌ను పార్ల‌మెంటు మొద‌టిరోజే ముగించారు. ఇక రాష్ట్ర‌ప‌తి రాజ‌ముద్ర‌తో అది చ‌ట్టం కావ‌డ‌మే త‌రువాయి.  ప్ర‌జోప‌యోగ‌మైన బిల్లుని పార్ల‌మెంటులో చ‌ట్టం చేసి, దానికి రాష్ట్ర‌ప‌తి ఆమోద‌ముద్ర వేయ‌డం ప‌రిపాటి. కాని ప్ర‌జ‌లు వ‌ద్ద‌న్న చ‌ట్టాన్ని ర‌ద్దు చేసే చ‌ట్టానికి..పైగా ఏ చ‌ట్టానికైతే ఏడాదిన్న‌ర క్రితం తాను రాజ‌ముద్ర వేశారో అదే చ‌ట్టం ర‌ద్దంటూ చేసిన బిల్లుకి చ‌ట్ట‌రూపం ఇవ్వ‌డం కోసం మ‌ళ్లీ తానే సంత‌కం పెట్టాల్సిరావ‌డం రామ్‌నాథ్ కోవింద్‌కు స‌రికొత్త అనుభ‌వ‌మే!

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement