Saturday, April 27, 2024

కాళీమాతకు అవమానం.. ఉక్రెయిన్ పై భారత్ గరంగరం

కాళీ మాత చిత్రం భారతీయ మనోభావాలను దెబ్బతీసేదిలా ఉండటంతో భారతీయులు వరుసగా ట్వీట్లు పెట్టారు. ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ జోక్యం చేసుకోవాలంటూ భారతీయులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తులు చేశారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వివాదంగా మారుతున్న క్రమంలో యుక్రెయిన్ రక్షణ శాఖ స్పందించింది.. వెంటనే ఆ చిత్రాన్ని ట్విటర్ నుంచి తొలగించింది. ఉక్రెయిన్ రక్షణ శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను గుర్తుకు తెచ్చేలా ‘వర్క్ ఆఫ్ ఆర్ట్’ అనే క్యాప్షన్‌తో ఓ చిత్రాన్ని షేర్ చేసింది. పైకి లేస్తున్న స్కర్ట్‌లో ఉన్న స్త్రీ చిత్రం అయినప్పటికీ.. ఆ చిత్రానికి పొందుపర్చిన వేషధారణ మహంకాళీ అవతారంలో ఉన్నట్లుగా ఉంది. ఈ ట్వీట్‌ను చూసిన భారతీయులు సోషల్ మీడియా వేదికగా ఉక్రెయిన్‌పై విమర్శలకు దిగారు. ఈ చిత్రం హిందూ దేవత కాళీని పోలి ఉందని, ఇలాంటి చిత్రాలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉక్రెయిన్ ప్రవర్తించిందంటూ కొందరు భారతీయులు ట్వీట్లు చేశారు.

ఉక్రెయిన్ రక్షణ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన అభ్యంతరకర పోస్టును తొలగించి క్షమాపణ చెప్పాలని ఓ భారతీయుడు ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. మరికొందరు భారతీయులు సైతం సోషల్ మీడియా వేదికగా ఉక్రెయిన్ రక్షణ శాఖ చర్యను ఖండించారు. ఈ విషయంపై రక్షణ శాఖ మంత్రి జైశంకర్ జోక్యం చేసుకోవాలని కోరుతూ ట్వీట్‌ను ట్యాగ్ చేశారు. భారతీయుల నుంచి విమర్శలు ఎక్కువవుతుండటంతో ఉక్రెయిన్ రక్షణ శాఖ స్పందించింది. వెంటనే తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి చిత్రాన్ని తొలగించింది. ఈ వివాదంపై ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆ దేశంలోని పలు ప్రాంతాలు బాంబుల మోతతో దద్దరిల్లి పోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement