Thursday, April 25, 2024

Big Story: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. న్యాయం చేయకుంటే ఉద్యమమే..

తిరుపతి సిటీ (ప్రభ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్నంగా అమలు చేస్తున్న సచివాలయ ఉద్యోగుల విషయంలో తొలుత అంతటా హర్షం వ్యక్తం అయ్యింది. కానీ, ఇప్పుడు అదే సచివాలయ ఉద్యోగులు తమకు న్యాయం జరగడం లేదని ఆందోళనకు దిగడంతో సీఎం జగన్ మానసపుత్రకి అయిన సచివాలయ ఉద్యోగుల వ్యవస్థపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎందుకిట్లా జరుగుతుందో పరిశీలిస్తే..

జూన్ 30 వ తేదీలోగా ప్రొబేషన్, డిక్లరేషన్ అమలు చేస్తామన్న ఏపీ ముఖ్యమంత్రి ప్రకటనపై చాలా మంది నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీనిపై గ్రామ సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపేందుకు రెడీ అవుతున్నారు. ‘‘అక్టోబర్ 2వ తేదీతో ప్రొబేషన్ పూర్తయింది.. ఇంతవరకు ఖరారుపై స్పష్టత లేదు. తొలుత లేవని చెప్పి.. ప్రొబేషన్  దగ్గరకు వస్తున్న సమయంలో శాఖపరమైన పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ రెగ్యులర్ స్కేల్ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమన్న అనుమానాలు కలుగుతున్నాయి’’ అని  ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు..

‘‘రెండేళ్లుగా రూ. 15,000 వేతనంతో ఇబ్బందులు పడి పని చేశాం. ప్రొబేషన్ ఖరారు అయితే రెగ్యులర్ డీ ఏ, హెచ్ ఆర్ ఎ,  ఐ.ఆర్ కలిపి ఎక్కువ మొత్తంలో జీతం వస్తే కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కొవిడ్ మూడోదశ నేపథ్యంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం’’ మరో ఉద్యోగి ఆక్రందన

కాగా, ప్రభుత్వం జూన్ 30 లోగా సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసి సవరించిన రెగ్యులర్ జీవితాలను జూలై 1 నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఫిట్మెంట్ గుర్తించే విషయంలోనూ స్పష్టత లేకపోవడంతో శనివారం నుంచి ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

స్పష్టత లేకపోవడంతోనే..

- Advertisement -

గత ఏడాది అక్టోబర్ 2వ తేదీనాటికి రెండేళ్ల సర్వీసు పూర్తయ్యింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారి  ప్రొబేషన్.. ఖరారు బాధ్యత అదే నెలలో కలెక్టర్ కు అప్పగించారు. శాఖల వారీగా పోలీసు విచారణ, శిక్షణ పూర్తి అయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత అభియోగాలు ఎదుర్కొంటున్నారు. సాధారణ ఐచ్ఛిక సెలవులెన్ని. ఎన్ని రోజులు సెలవులు తీసుకుంటున్నారు. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.. వీటి ఆధారంగా సర్వీస్ రిజిస్టర్ ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పంచాయతీ శాఖలో గ్రేడ్ 5, కార్యదర్శులు శాఖాపరమైన పరీక్షలతోపాటు సీపీ టి. కంప్యూటర్ ప్రొబేషి యె న్స్ టెస్ట్ ను నిర్వహించారు. ఈ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందన్న దానిపై నేటికి స్పష్టత లేదు. ఏఎన్ఎం లకు ప్రొబేషన్ డిక్లరేషన్ అప్పుడు పరీక్షలు పెట్టడం సమంజసం కాదని, వారికి ప్రాక్టికల్స్ చేయాల్సి ఉందని తెలియజేస్తున్నారు.

ఆందోళనలకు కార్యాచరణ..

రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్న పే స్కేల్ ఉద్యోగులకు వర్తింప చేయాలని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. రాజకీయ పొత్తులు ఉద్యోగులపై ఉండరాదని వివిధ రకాల డిమాండ్లతో ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలియజేసేందుకు కార్యాచరణ చేస్తున్నారు. దీనిలో భాగంగా 11వ తేదీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల కు వినతి పత్రాలు సమర్పించడం, 12వ తేదీ  జిల్లా మంత్రుల కు వినతి పత్రాలు, 13వ తేదీ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని సచివాలయ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు..

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 1,312 గ్రామ సచివాలయాలు ఉండగా..  11,640 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు.. ప్రజల ముంగిటకు ప్రభుత్వ పథకాలు అమలు చేసే క్రమంలో 540 సేవలకు విస్తరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 వేల మంది జనాభాకు ఒక సచివాలయాన్ని. పట్టణ ప్రాంతాల్లో 5 వేల జనాభాకు ఒకటి ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో 10 మంది ఉద్యోగులు నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో 13 మందిని ఉద్యోగాల్లో నియమించటం జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement