Sunday, April 28, 2024

స‌చిన్ టెండూల్క‌ర్@50

నేటితో 50వ ఏడులోకి అడుగుపెట్టారు క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్. నేడు ఆయ‌న‌ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
సచిన్ అంటే కేవలం ఆటగాడు కాదు.. క్రికెట్ ను మతంలా భావించే మన భారతదేశంలో అభిమానులకు దేవుడు . ఎందరికో స్ఫూర్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు నిలువెత్తు నిదర్శనం. రికార్డులు దాసోహమైనా.. కోట్లకు పడగలెత్తినా.. చిన్నవయసులోనే ఆకాశమంత పాపులారిటీ వచ్చినా.. అడుగు నేలపైనే అని నమ్మిన అసాధారణ వ్యక్తి. తనకు జట్టులో చోటు దక్కనప్పుడు.. ఆడుతున్నది జూనియర్లు అయినా సరే మైదానంలోకి వెళ్లి డ్రింక్స్ ఇవ్వగల సాదాసీదా వ్యక్తి. తాను ఆడిన పిచ్ ను కళ్లకు అద్దుకుని గౌరవించే మామూలు మనిషి. ఇప్పటి తరానికి సచిన్ ఆట ఓ చరిత్ర కావచ్చు. కానీ నైంటీస్ కిడ్స్’కి సచిన్ ఓ మధుర జ్ఞాపకం. ఓ స్ఫూర్తి. ఓ పాఠం.

అతి చిన్న కెరియర్ లో అత్యంత ప్రభావం చూపిన అతి తక్కువ ఆటగాళ్లలో సచిన్ ఒకరు.ఎత్తుపళ్లాలు ప్రతి జీవితంలో ఉంటాయి. సచిన్ కూడా వీటిని ఎదుర్కొన్నాడు. టీమిండియా కెప్టెన్ గా విఫలమైనా.. ఫామ్ కోల్పోయినా.. ‘నెర్వస్ నైంటీస్’తో ఇబ్బంది పడినా.. బహుమతిగా వచ్చిన కారును భారత్ కు తీసుకొచ్చే విషయంలో విమర్శలు ఎదుర్కొన్నా.. రికార్డుల కోసమే ఆడతాడని ఆరోపణలు చేసినా.. రాజ్యసభ సభ్యుడిగా వెళ్లడంపై ప్రశ్నలు ఎదురైనా.. అన్నింటికీ ఆటతోనే బదులిచ్చాడు. ఆటలో ఓడిపోయి ఉండవచ్చు.. కానీ వ్యక్తిత్వంలో ఎన్నడూ ఓడిపోలేదు.24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ తర్వాత 2013లో క్రికెట్ కు సచిన్ రిటైర్ మెంట్ ప్రకటించాడు. పదేళ్లు గడిచిపోయింది. ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ సచిన్ పాపులారిటీ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఉంటుందనేది న‌గ్న స‌త్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement