Thursday, April 25, 2024

కోట్లు విలువైన 11 లగ్జరీ కార్లు సీజ్

హైదరాబాద్ లో ట్యాక్స్ లు చెల్లించకుండా తిరుగుతున్న విదేశీ కార్లపై రవాణాశాఖ కొరడా ఝులిపించింది. అక్రమంగా తిరుగుతున్న 11 ఖరీదైన కార్లను సీజ్ చేసింది. పన్ను ఎగవేస్తూ హైదరాబాద్‌లో యథేచ్ఛగా తిరుగుతున్న లగ్జరీ కార్ల యజమానులపై దృష్టి సారించిన రవాణాశాఖ.. ఆరు నెలలుగా నగరంలో తిరుగుతున్న లగ్జరీకార్లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు నేతృత్వంలో చర్యలకు ఉపక్రమించారు. 40 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు, మోటర్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా తిరుగుతున్న 11 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ఈ 11 వాహనాల నుంచి ప్రభుత్వానికి రూ. 5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు పన్నుల రూపంలో రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

సీజ్ చేసిన వాహనాల్లో మెర్సిడెస్ బెంజ్, మాసరట్టి, ఫెరారీ, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లంబొర్గిని తదితర ఖరీదైన కార్లు ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన కార్లకు 2వందల శాతం వరకు పన్నులు చెల్లించాల్సి ఉంటుందని, నిబంధనల ప్రకారం పత్రాలు పరిశీలించి ట్యాక్స్ వసూలు చేసిన తర్వాత ఆ కార్లను యజమానులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించకుండ తిరుగుతున్న వాహనాలను ఉపేక్షించబోమని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు రవాణా శాఖ చరిత్రలో ఇలాంటి దాడులు జరగడం ఇదే తొలిసారి.

ఇది కూడా చదవండి: కర్నూలులో వెరైటీ పెళ్లి.. వధూవరులు లేకుండానే..

Advertisement

తాజా వార్తలు

Advertisement