Friday, May 17, 2024

విద్యుత్‌ రంగంలో విప్లవం.. కరెంట్‌ కష్టాలకు చెక్​పెట్టిన తెలంగాణ​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విద్యుత్‌ రంగంలో తెలంగాణ విప్లవాత్మకమైన ప్రతిభను కనబర్చింది. విద్యుత్‌ లోటు నుంచి మిగులు విద్యుత్‌ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కరెంట్‌ కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్‌ను అన్ని రంగాలకు అందిస్తున్నది. సమైక్య రాష్ట్రంలో కరెంట్‌ కోతలతో తల్లడిల్లిన తెలంగాణ.. ఇప్పుడు వెలుగు జిలుగుల రాష్ట్రంగా మారింది. ‘ తలసరి విద్యుత్‌ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. విద్యుత్‌ సరఫరా సజావుగా జరిగేలా పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేసేందుకు ఇప్పటికే రూ. 34.970 కోట్లను ఖర్చు చేశాం. రాష్ట్రం ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. ఇప్పుడు స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 17,305 మెగావాట్లకు పెరిగింది. 2014లో తలసరి విద్యుత్‌ వినియోగం 1,110 యూనిట్లు ఉండగా, 2021 నాటికి 2,012 యూనిట్లకు చేరుకున్నది. జాతీయ తలసరి విద్యుత్‌ వినియోగంతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్‌ వినియోగం 73 శాతం అధికంగా ఉంది. ఇది రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే అద్భుతమైన సూచికగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ‘ అన్నారు.

భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. మొత్తం నాలుగు యూనిట్ల నుంచి 1,080 మెగావాట్ల విద్యుత్‌ను నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తోంది. నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం పనులు దాదాపు పూర్తికావచ్చాయి. 2023 నాటికి విద్యుత్‌ కేంద్రం అందుబాటులోకి వస్తుంది. గతేడాది మార్చి నాటికి రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ గరిష్టంగా 13,688 మెవాట్లకు చేరగా.. రాబోయే రోజుల్లో 17 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థలను పటిష్టం చేసింది.

సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలోనూ ప్రగతి..
సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలోనూ తెలంగాణ మంచి ప్రగతిని సాధించింది. రాష్ట్ర విభజన సమయంలో కేవలం 74 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ మాత్రమే ఉత్పత్తి కాగా, ఇప్పుడు 4,431 సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. రాబోయే రెండేళ్లలో 7 వేల మెగావాట్లకు చేరుకునేలా కార్యాచరణ చేపట్టింది. పరిశ్రమలకు గతంలో పవర్‌ హాలేడేలు ఉండగా, ఇప్పుడు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడం వల్ల మూడు షిప్టులు పని చేయడంతో కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 400 కేవీ, 220 కేవీ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడంతో రాష్ట్ర రాజధానిలో విద్యుత్‌కు అంతరాయం లేకుండా సరఫరా జరుగుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement