Saturday, May 4, 2024

ఇంటర్ ఫలితాలపై సీఎం కేసీఆర్ కు రేవంత్ లేఖ

తెలంగాణ ఇంటర్ ఫలితాలపై సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇంటర్‌ పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో తప్పుడు నిర్ణయాల వల్లే 23 మంది బలయ్యారని ఆరోపించారు. ఈ సారి జ‌రిగిన‌ ఇంటర్‌ పరీక్షల్లో నెలకొన్ని గందరగోళాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు.

కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు క్లాస్ రూం పాఠాలకు దూరమైన విషయం తెలిసిందేన‌ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ క్లాసుల విధానం తెర మీదకు వచ్చిందని తెలిపారు. ఆన్ లైన్ విద్యాబోధనకు మౌలిక సదుపాయాల కల్పన అన్నది అత్యంత ప్రధానమ‌ని చెప్పారు. ఇంటర్ నెట్, కంప్యూటర్లు, లాప్ టాప్ లాంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రభుత్వ, గురుకుల కళాశాలల్లో చదువు కునే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఇవి ఏ మేరకు అందుబాటులో ఉన్నాయని ప్రశ్నించారు.

గత తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం విజ్ఞుల లక్షణమ‌ని అన్నారు. అయితే, ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు.. తదుపరి పరిణామాలు చూస్తుంటే మీలో ఆ విజ్ఞత లోపించిందని అర్థమవుతోందని పేర్కొన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థుల‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement