Friday, May 3, 2024

Spl Story | కాంగ్రెస్​కు పునరుజ్జీవం భారత్​ జోడో.. అలుపెరగని బాటసారి రాహుల్​!

దేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడం లక్ష్యం భారత జాతీయ కాంగ్రెస్​​ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఈ ఏడాది భారత్​ జోడో యాత్ర చేపట్టారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో 2022 సెప్టెంబర్​ 7న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, మాహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, హర్యానా రాష్ట్రల్లో యాత్ర పూర్తి అయ్యింది. అలుపెరగని బాటసారిలా రాహుల్​ గాంధీ అందరితో కలిసిపోయి నడవడం అనేది ఆ పార్టీ చరిత్రలో మరో మలుపు కానుంది. రాహుల్​ జీవితంలోనూ 2022వ సంవత్సరం మరుపురాని ఓ మధురానుభూతిలా మిగలనుంది.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

అయిదు నెలల్లో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను చుట్టేలా కాంగ్రెస్​ ముఖ్య నేత రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్రకు ప్లాన్​ చేశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్​ వరకు  3, 570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. కాగా, భారత్ జోడో యాత్ర డిసెంబర్ 24న ఢిల్లీలో అడుగు పెట్టనుంది. దేశ రాజధానిని కవర్ చేసిన తర్వాత.. తొమ్మిది రోజుల పాటు విరామం ఉంటుంది. ఆ తర్వాత జనవరి 3వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోకి ఈ యాత్ర ప్రవేశిస్తుంది. అయితే.. ఈ యాత్ర సందర్భంగా ఎన్నికలపరంగా కీలకమైన కులాల ఓటు బ్యాంకుని కాపాడుకునే అంశాలను కాంగ్రెస్​ పార్టీ పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. 

కులాల కుంపట్లు, మతాల మంటల్లో దేశం అట్టుడుకుతోంది. ఏ రాష్ట్రంలో చూసినా హలాల్​, హిజాబ్​, హిందూ, ముస్లిం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రజలను ఎడ్యుకేట్​ చేయాల్సిన లీడర్లు వారిని కులం, మతం పేరిట రెచ్చగొడుతూ పబ్బంగడుపుతున్నారు. ప్రజలు ఆలోచన చేస్తే తమ రాజకీయ జీవితం మంటగలిసిపోతుందనే భావనతో కొంతమంది అదే పనిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలను మతం మత్తులో ముంచి ఆలోచించకుండా చేస్తున్నారు.

అయితే.. కాంగ్రెస్​ పార్టీలో నెలకొన్న విపరీత పరిస్థితులు.. నేతల మధ్య అంతరాలను తొలగించి, సామాన్య ప్రజలను విభజన రాజకీయాల నుంచి కాపాడాలనే లక్ష్యంతో పార్టీ ముఖ్యనేత రాహుల్​ గాంధీ కొత్త ఆలోచన చేశారు. దీనికి తోడు తను నిత్యం ప్రజల్లోఉండడానికి ఈ యాత్ర ఎంతో ఉపయోగపడింది. చిన్నారుల నుంచి మొదలుకుని, వృద్ధుల వరకు ఎంతో మందిని పలకరిస్తూ.. అలుపెరగని బాటసారిలా సాగిపోతున్నారు రాహుల్​ గాంధీ. ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు.

- Advertisement -

అయితే.. తమిళనాడు మొదలుకుని తెలంగాణ వరకు సాగిన ప్రయాణం ఎంతో ఉద్వేగంగా సాగిందంటున్నారు ఆ పార్టీ లీడర్లు. దక్షిణ భారత యాత్రలో రాహుల్​ గాంధీకి ఎక్కడలేనంత ప్రాచుర్యం లభించింది. తనను తాను చిన్నపిల్లాడిగా మార్చుకుని పసిపిల్లలతో కలిసి మెలిసి రాహుల్​ గాంధీ సాగడం.. వారిని భుజాలపై మోస్తూ యాత్ర చేయడం వంటి ఎన్నో సన్నివేశాలు కనిపించాయి. ఇవన్నీ ఈ ఏడాది మరుపురాని, మరిచిపోలేని విషయాలుగా పార్టీ నేతలు, సామాన్యులు యాది చేసుకుంటున్నారు.

ఉత్తరాదికి చేరిన యాత్ర…

ఉత్తరప్రదేశ్​ గాంధీలకు ముఖ్యమైన రాష్ట్రం. రాహుల్ తల్లి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఇక.. గత లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీపై రాహుల్​ గాంధీ ఓటమి  చెందారు. అప్పటిదాకా ఆయన అమేథీ లోక్​సభకు ప్రాతినిధ్యం వహించారు. రాహుల్ సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట్రంలో చురుగ్గా వ్యవహరిస్తూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నారు.

కాగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధినేత్రి మాయావతి, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి) చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ వంటి బీజేపీ వ్యతిరేక నేతలను యాత్రలో పాల్గొనాలని ఇప్పటికే రాహుల్ వారిని ఆహ్వానించారు.

షెడ్యూల్​ ప్రకారం.. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర UPలోని 75 జిల్లాల్లో మూడు జిల్లాల మీదుగా మాత్రమే సాగుతుంది. ఈ యాత్రని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు పార్టీ వరగ్ఆలు సన్నాహాలు చేస్తున్నాయి. నాలుగు రోజుల్లో మూడు జిల్లాల్లో రాహుల్ గాంధీ 110 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.

భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా లోని సరిహద్దు నుంచి యూపీలోకి ప్రవేశించనుంది. దీని తర్వాత, ఇది జనవరి 4న బాగ్‌పట్‌లోకి, జనవరి 5న షామ్లీలో, జనవరి 6న కైరాన్‌లోకి ప్రవేశించి హర్యానాలోని సోనేపట్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

యూపీలో ప్రయాణం సాఫీగా సాగేందుకు ఆ పార్టీ సమన్వయ కమిటీ ఢిల్లీలో భేటీ అయ్యింది. సమన్వయ కమిటీ అధినేత సల్మాన్ ఖుర్షీద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూపీలో పాదయాత్రకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. వివిధ కులాల వారితో అనుసంధానం చేసేందుకు కాంగ్రెస్ ప్రయ‌త్నిస్తుంద‌ని, అందుకు ప్రణాళిక రూపొందించింది. అత్యంత వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ కులాలు, సంఘాల నాయకులు రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. యాత్రలో చేరాల్సిందిగా వెనుకబడిన కులాలకు చెందిన సంఘాల నేతలందరికీ ఆహ్వానాలు పంపినట్లు పార్టీ నేత అనిల్ యాదవ్ తెలిపారు.

రాహుల్‌కి తోడుగా ఎవరు ఉంటారు..

ఓబీసీ నేతలు తమ సమస్యలు, పలు సమస్యలపై రాహుల్‌తో మాట్లాడనున్నారు. దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన వారు కూడా రాహుల్‌తో కవాతు చేయనున్నారు. వివిధ చిన్న తరహా మరియు కుటీర పరిశ్రమలకు చెందిన వ్యవసాయ కార్మికులు, చేతివృత్తులవారు మరియు కార్మికులు కొన్ని ప్రదేశాలలో యాత్రలో చేరతారు. సాహితీవేత్తలు, మేధావులు, సామాజిక సంస్థలు కూడా ఇందులో పాల్గొంటాయి.

పాద యాత్రలో 11,000 మంది యాత్రికులు పాల్గొంటారని సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని ఐదు లక్షల మందికి ఆహ్వానాలు అందాయి. అవి వారి సంబంధిత జిల్లాల్లో పంపిణీ చేశారు. కొంతమందిని పోస్ట్ కార్డుల ద్వారా ఆహ్వానిస్తున్నారు. అనేక రాష్ట్రాల గుండా 2,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన యాత్ర జనవరి మొదటి వారంలో పంజాబ్‌కు చేరుకుంటుంది. ఇది దాదాపు 10 రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఆ తర్వాత జమ్మూ, కాశ్మీర్‌కు బయలుదేరుతుంది.  సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ యాత్ర జనవరి 30 నాటికి కాశ్మీర్ చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement