Monday, April 29, 2024

బ్రేకింగ్: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర తగ్గింపు

కోవిడ్-19 టీకాలో ఒకటైన కోవిషీల్డ్ ధరను రూ.400 నుంచి రూ.300కు తగ్గిస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాలకు మాత్రమే ఈ ధరను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. తగ్గింపు ధరలు ఇప్పటికిప్పుడే అందుబాటులోకి వస్తాయని సంస్థ అధినేత అధర్ పూనావాలా ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం ఆదా అవ్వడమే కాకుండా మరింత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుందన్నారు.

సీరం ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన కోవిషీల్డ్ టీకాను మూడు ధరల్లో విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు రూ.600కు అమ్ముతున్నారు. అయితే ఈ విషయమై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగుతోంది. ఒకే టీకాను ఇలా వేరు వేరు ధరలకు అమ్మడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మే ధరల్లో వ్యత్యాసం పట్ల పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై, సీరం ఇనిస్టిట్యూట్‌పై ఒత్తిడి పెరగడంతో ధర తగ్గించక తప్పలేదని అంటున్నారు. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించే టీకా ధరలు మాత్రమే తగ్గించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement