Friday, May 3, 2024

Weather: 14 వరకు రెడ్ అలర్ట్.. మరో రెండ్రోజులపాటు దంచికొట్టనున్న వానలు!

రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు, నాలుగు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. తెల్లందాకా, పొద్దాకా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక.. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రభావిత గ్రామాల్లో ఇప్పటికే అధికారులు చర్యలు వేగవంతం చేశారు. పలు చోట్ల చెరువు కట్టలకు గండ్లుపడగా.. చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. ప్రతి రోజూ సీఎం కేసీఆర్​ మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్​ చేస్తూ.. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ఏ జిల్లాకు చెందిన మంత్రులు అక్కడే ఉంటూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల రాకతో అధికారులు కూడా వేగవంతంగా చర్యలు తీసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.

కాగా, తెలంగాణను భారీ వర్షాలు ఇప్పట్లో వీడేట్టులేవని ఇవ్వాల మరో కొత్త ముచ్చట తీసుకొచ్చింది వాతావరణ శాఖ. ఈ నెల 14వ తేదీ దాకా రాష్ట్రంలోని కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇవ్వాల (మంగళవారం) ప్రకటించింది. ఈ మేరకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సిద్ధిపేట, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కామారెడ్డి, హనుమకొండ, మెదక్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక.. నిర్మల్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఓవైపు ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితలం ఆవర్తనం విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.

https://twitter.com/HYDmeterologist/status/1546811570847551489
Advertisement

తాజా వార్తలు

Advertisement