Thursday, May 2, 2024

రత్నప్రభ ఒక్క మాటతో సీన్ రివర్స్!

ఒక్క మాట..  ఒకే మాట.. తిరుపతి బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలను ఇరకాటంలో పడేసింది. ఇక జనసేన నేతలకు కలవరానికి గురి చేస్తోంది. ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్ధి కాదు, మీడియాలో ఎందుకు అలా ప్రచారం జరుగుతుందో తెలియదు’ అన్న రత్నప్రభ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏపీకి కాబోయే సీఎం పవన్ కల్యాణేనని, ఆయనకు మంచి గౌరవం ఇవ్వాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారని తిరుపతి సాక్షిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే.. రత్నప్రభ అసలు పవన్ సీఎం అభ్యర్థే కారని, సీఎం అభ్యర్థిపై  తమ పార్టీ అసలు ప్రకటనే చేయలేదని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ తిరుపతి బై పోల్ లో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన నాయకులు గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఇవాళ జనసేన అధినేత పవన్ సైతం పాదయాత్ర చేయనున్నారు. ఇలాంటి సమయంలో రత్నప్రభ వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల వేళ రత్నప్రభ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు సైతం బీజేపీని టార్గెట్ చేశాయి.

తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రధాన పోటిదారు వైసీపీని మాత్రమే విమర్షిస్తే లాభం లేదనుకున్న బీజేపీ.. టీడీపీని ముందుగా టార్గెట్ చేసింది. తామే ప్రధాన ప్రతిపక్షం అనే భావన ప్రజల్లో కల్పించేందుకు టీడీపీని టార్గెట్‌ చేస్తున్నారనే కామెంట్స్‌ పొలిటికల్‌ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. ఏదో ఒకటి చేసి తిరుపతి ఉపఎన్నికలో రాజకీయ అటెన్షన్‌ తమ వైపే ఉండేలా గట్టిగా ప్రయత్నిస్తుంది బీజేపీ. అయితే, ప్రధాన పోటీదారు అనిపించేందుకు మొదలుపెట్టిన ఈ వ్యూహం చిక్కుల్లో పడేసింది. తాజాగా పవన్ పై రత్నప్రభ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి ఆయుధంగా మారింది. మాటలు మార్చడం బీజేపీ అలవాటు అయ్యిందని, హోదాపై మాట మార్చినట్లు.. ఇప్పుడు సీఎం అభ్యర్థి విషయంలోనూ అదే చేస్తున్నారని విమర్శస్తున్నారు. పవన్ తో రాజకీయ లబ్ధి పొందేందుకే జనసేనతో పొత్తు పెట్టుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. మరోవైపు రత్నప్రభ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి. పార్టీ రాష్ట్ర అధినేత ఓ మాట, అభ్యర్థి ఇంకో మాట చెబుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఉత్సహంగా ప్రచారం చేసిన జనసైనికులు.. రత్నప్రభ మాటలతో నిరాశకు గురవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి జనసేన, బీజేపీల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది.  

ఏపీలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల మధ్య అవగాహన ఏర్పడడంతో కలిసి పోటీ చేశాయి. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేన అత్యధిక స్థానాలు దక్కించుకుంది. ఓట్ షేర్ కూడా బీజేపీ కంటే ఎక్కువే. దీంతో తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో జనసేనే పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు బలంగా భావించాయి. అయితే పెద్దల ఒత్తడి మేరకు ఆ సీటును బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది జనసేన. అయితే తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ బలముందని ఆ పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల బీజేపీ శ్రేణులు సహకరించలేదనే అసంతృప్తి జనసేన శ్రేణుల్లో ఉంది. అందుకే గెలవాల్సిన స్థానాలను కూడా కొన్నిచోట్ల కోల్పాయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్ల బీజేపీ వల్ల చాలా నష్టపోయామని బాధపడుతున్నారు. విజయవాడలో అయితే ఏకంగా బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనే డిమాండ్ వినిపించింది.

తిరుపతి సీటు కోసం చివరి వరకూ పోరాడింది జనసేన. అయితే ఢిల్లీలోని కమలం పెద్దల ఒత్తిడితో పవన్ కల్యాణ్ సీటును బీజేపీకి వదిలేశారు. అయితే ఆ పార్టీ నుంచి పెద్దగా సపోర్ట్ ఉండట్లేదని.. తమ మాటకు విలువ ఇవ్వట్లేదని కొంతమంది జనసేన నేతలు భావిస్తున్నారు. తిరుపతిలో ప్రచారానికి పవన్ కల్యాణ్ కూడా దూరంగా ఉండబోతున్నారనే టాక్ జనసేన శ్రేణుల్లో బలంగా వినిపించింది.  

- Advertisement -

తిరుపతి స్థానానికి జనసేన తరపున అభ్యర్థిని నిలబెట్టకపోవడంపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకింత అసంతృప్తి ఉన్నా… బీజేపీ, పవన్ కల్యాణ్‌ పైనే ఆధారపడటంతో అభిమానులు కాస్తంత కూల్ అయ్యారు. ఆ క్రమంలో ఇవాళ్టి జనసేనాని పాదయాత్ర ఓ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది.  అయితే, పవన్ ప్రచారం సందర్భంగా రత్నప్రభ వ్యాఖ్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లే యేచనలో పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ వ్యవహరంపై జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

https://youtu.be/t7Cu5ksrTek
Advertisement

తాజా వార్తలు

Advertisement