Sunday, April 28, 2024

తెలంగాణలో కోవిడ్ అండర్ కంట్రోల్.. వ్యాక్సినేషన్ లో రంగారెడ్డి లాస్ట్

తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 15 నుంచి 17 ఏళ్ల వయసున్న వారికి టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే హనుమకొండ జిల్లాలో 103 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది. అయితే, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం 50 శాతమే జరిగింది.

రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కవరేజీ 70 శాతం లోపే ఉంది. ఈ జాబితాలో రంగారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉంది. అక్కడ కేవలం 51 శాతం మంది టీనేజర్లకే కరోనా టీకాలు అందాయి. ఈ జిల్లాలో 1,77,102 మంది 15 నుంచి 17 ఏళ్ల లోపువారుండగా.. కేవలం 90,046 మందికే ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ వేశారు.

చివరి నుంచి రెండో స్థానంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నిలిచింది. జిల్లాలో 52 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది. జిల్లాలో మొత్తం 26,783 మందికిగానూ 14,054 మందికి టీకాలు వేశారు. హైదరాబాద్, వికారాబాద్ లలో 55 శాతం మందికి కరోనా టీకా ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి రావడం, కేసులు తగ్గుతుండడంతో టీకాలు వేయించుకునేందుకు కొందరు నిర్లక్ష్యం చూపిస్తున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అన్ని జిల్లాల డీఎమ్హెచ్వోలు, వైద్య అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వాక్సినేషన్, జ్వర సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. 18 ఏళ్లకు పైబడిన వారికి రెండు డోసులు పూర్తి చేసిన కరీంనగర్, హనుమకొండ జిల్లాల వైద్య అధికారులను మంత్రి అభినందించారు. అలాగే, 15-17 ఏళ్ల కేటగిరీలో 100 శాతం పూర్తి చేసి మొదటి జిల్లాగా నిలిచినందుకు హన్మకొండ జిల్లాల అధికారులను మంత్రి అభినందించారు. ఇతర జిల్లాలు ఈ రెండు జిల్లాలను స్ఫూర్తిగా తీసుకుని త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement