Tuesday, May 14, 2024

Same-Sex Marriage | అలా చేయడం తగదు.. భారతీయ సంప్రదాయం కాదన్న పలు రాష్ట్రాలు

స్వలింగ వివాహాలకు చట్టపరమైన అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను తమ అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్రం కోరింది. కాగా, ఇప్పటికే మణిపూర్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, సిక్కిం నుంచి కేంద్రానికి నివేదికలు అందాయి. ఇక.. కాంగ్రెస్​ పాలిత రాజస్థాన్​ కూడా స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు ఇవ్వాల (బుధవారం) తెలిపింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం భారతీయ సంప్రదాయాలకు విరుద్ధమని కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వాల (బుధవారం) తెలిపింది. స్వలింగ వివాహాలపై రాజస్థాన్ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. భారతీయ సమాజంలో స్వలింగ వివాహం చేసుకునే ఆచారం లేదని, ఇది జీవసంబంధమైన మగ, ఆడ మధ్య వివాహాన్ని మాత్రమే గుర్తించగలదని అభిప్రాయపడింది. స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం వల్ల సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని కేంద్రానికి తెలిపింది.

స్వలింగ వివాహాల చట్టబద్ధత సామాజిక, కుటుంబ వ్యవస్థపై దీర్ఘకాలికప్రభావాన్ని చూపుతుందని రాజస్థాన్​ ప్రభుత్వం అభిప్రాయపడింది. రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం కలెక్టర్ల అభిప్రాయాన్ని కూడా కోరిందని.. తమ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ స్వలింగ వివాహాలు లేవని, ప్రజల అభిప్రాయం కూడా దీనికి వ్యతిరేకంగా ఉందని వారు ప్రతిస్పందించారు.

- Advertisement -

కాగా, చట్టబద్ధత విషయంలో మణిపూర్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, సిక్కిం, రాజస్థాన్‌ నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి ఇవ్వాల (బుధవారం) తెలిపారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement