Saturday, May 4, 2024

India: గోధుమలకు పెరుగుతున్న డిమాండ్​.. దిగుబడులు, దిగుమతులు తగ్గడమే కారణం!

దేశంలో గోధుమలు, బియ్యం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అయితే.. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రాకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు తగ్గడం కూడా రేట్లు పెరుగుదలకు దోహదపడుతోంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం గోధుమలు, ఆటా ఎగుమతులపై నిషేధం సరైన సమయంలో విధిస్తే ఈ పరిస్థితులు ఉండేవి కావని వ్యాపారులు అంటున్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

బియ్యం, గోధుమలు, ఆటా సహా నిత్యావసర ఆహార పదార్థాల సగటు రిటైల్ ధరలు గత ఏడాది కాలంలో గణనీయంగా పెరిగాయి. కొన్ని నెలలుగా గోధుమలు, ఆటా ధరలు పెరుగుతున్నాయి కానీ, తగ్గడం లేదు. ఇక.. దేశ రాజధాని ఢిల్లీలోని హోల్‌సేల్ మార్కెట్‌లలో వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. సరఫరా తగ్గడం, డిమాండ్​ పెరగడం వంటి కారణాలతో గోధుమ ధరలు క్వింటాల్‌కు రికార్డు స్థాయిలో రూ. 2,560 దాటాయి.

ఈ సంవత్సరం ప్రారంభంలో వీచిన హీట్​ వేవ్స్​ (వేడిగాలులు)తో గోధుమల దిగుబడి పెద్ద ఎత్తున తగ్గిపోయింది. ఇది వ్యవసాయ ఉత్పత్తుల దేశీయ సరఫరాలపై ప్రభావం చూపింది. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ లారెన్స్ రోడ్ మండికి చెందిన జై ప్రకాష్ జిందాల్ తెలిపారు. ప్రస్తుతం గోధుమలు క్వింటాల్‌కు 2,560 రూపాయలుగా ఉన్నాయి. ఈ పండుగల సీజన్‌లో.. రానున్న రోజుల్లో రూ.2,600 స్థాయికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

మే 14న కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై నిషేధం విధించినప్పటి నుంచి మండి ధరలు క్వింటాల్‌కు రూ.2,150-రూ.2,175గా ఉన్నాయి. ఈ ఏడాది ఉత్పత్తి తక్కువగా ఉందని, ప్రభుత్వం సరైన సమయంలో ఎగుమతులను ఆపలేదని వ్యాపారి జిందాల్ అన్నారు. ప్రభుత్వం నిషేధం విధించే సమయానికి అప్పటికే చాలా గోధుమలు ఎగుమతి అయ్యాయన్నారు. కానీ, ఈ చర్యలు కేంద్ర ప్రభుత్వం ముందే చేపట్టాల్సి ఉండేదన్నారు. ప్రభుత్వ కోటా బియ్యం, గోధుమలు, ఆటా సగటు రిటైల్ ధరలలో కూడా ఇదే ధోరణిని కనిపిస్తోందన్నారు.

- Advertisement -

వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం ఆటా సగటు రిటైల్ ధర కిలోకు రూ.36.13గా ఉంది. అదే విధంగా శుక్రవారం సగటు రిటైల్‌లో కిలో బియ్యం ధర రూ.38.2 ఉండగా, గోధుమలు రూ.31గా ఉన్నాయి. గోధుమల ధరలు దాదాపు 14-15 శాతం పెరగగా, ఆటా ధరలు దాదాపు 18-19 శాతం పెరిగాయని వ్యాపారులు తెలిపారు. అదేవిధంగా ఢిల్లీ రిటైల్ మార్కెట్లలో రిటైల్ ధరలు కూడా దాదాపు 7-8 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా డిమాండ్‌-సరఫరా పరిస్థితులు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పెరగడం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పలు అంశాలు గోధుమల ధరలు పెరగడానికి కారణాలుగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement