Thursday, May 2, 2024

‘దిశ’ ఎన్‌కౌంటర్ విచారణ వాయిదా, ‘సిర్పూర్కర్’ నివేదికను పరిశీలిస్తాం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్ ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో జస్టిస్ సిర్పూర్కర్‌ కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించాకే తదుపరి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 2019 డిసెంబరు 6న దిశ అత్యాచార నిందితులు నలుగురు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. విచారణ సమయంలో పోలీసులపై కాల్పులు జరపడం వల్ల ఎన్కౌంటర్ చేసినట్లు అప్పటి పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఛైర్మన్గా సిట్ ఏర్పాటైంది. ఈ ఎన్‌కౌంటర్‌పై ఆరోపణలు వెల్లువెత్తడంతో నిజనిర్థారణ జరిపేందుకు 2019 డిసెంబర్‌లో జస్టిస్ సిర్పూర్కర్‌ కమిషన్ను సీజేఐ బెంచ్‌ ఏర్పాటు చేసింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన విధానాన్ని తెలుసుకునేందుకు కమిషన్‌ క్షేత్రస్థాయిలో పర్యటించింది.

నిందితుల కుటుంబ సభ్యులు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు సహా సంబంధిత అధికారులను విచారణ జరిపింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు పరిశీలించింది. 57 మంది సాక్షులను విచారించినట్లు నివేదికలో పేర్కొంది. 47 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిన సిర్పూర్కర్ కమిషనర్ ఈ ఏడాది జనవరి 30న నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ప్రస్తుతం తెలంగాణా ఆర్టీసీ ఎండీగా పని చేస్తున్న వీసీ సజ్జనార్ బుధవారం విచారణకు హాజరయ్యారు. ఇకపై కేసు విచారణలో జాప్యాన్ని అంగీకరించబోమని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎలాంటి మధ్యంతర దరఖాస్తులను స్వీకరించేది లేదని పేర్కొన్నారు. కమిషన్ ఇచ్చిన నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించాకే విచారణ జరపనున్నట్లు సీజేఐ ధర్మాసనం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement