Friday, May 3, 2024

జమ్మూకశ్మీర్ లో రాజకీయ ప్రతిష్టంభన తొలగిపోతుందా?

జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రధాన పార్టీల ముఖ్య నేతలతో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీడీపీ నుంచి మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్‌తో పాటు ఇతర పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపు 14 మంది నేతలతో రెండు గంటలకుపైగా సమావేశం నిర్వహించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌ నేతలతో జరుగుతున్న తొలి అఖిలపక్ష సమావేశం ఇదే కావడం గమనార్హం. దీంతో ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

జ‌మ్మూక‌శ్మీర్‌లో రాజ‌కీయ సుస్థిర‌త‌ను తీసుకురావాల‌న్న ఉద్దేశంతో కేంద్రం.. ఈ స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు సమాచారం. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న సమస్యను పరిష్కరించడంతో పాటు అక్కడి రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రధాని మోదీ ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ప్రధానిని కోరామని అన్నారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నట్టు ప్రధాని చెప్పారని ఆజాద్ వివరించారు. ప్రధాని ముందు 5 డిమాండ్లు ఉంచామని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని, కశ్మీర్ లోయలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఎన్నికలు నిర్వహించాలని, కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, జమ్మూ కశ్మీర్ ప్రజల భూ హక్కులకు భద్రత కల్పించాలని కోరినట్టు ఆజాద్ వెల్లడించారు.

కాగా, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసి, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్, చట్ట సభలున్న కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్‌లో రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతో పాటు పలువురు నేతలు నెలల పాటు నిర్భందంలోనే ఉన్నారు. 

ఇది కూడా చదవండి: కేటీఆర్ ను ఫిదా చేసిన స్వరం.. మెదక్ జిల్లా ఆణిముత్యం

Advertisement

తాజా వార్తలు

Advertisement