Thursday, April 25, 2024

Delhi | ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పెంబర్తి, చంద్లాపూర్.. ప్రకటించిన కేంద్ర పర్యాటక శాఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జాతీయస్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు గ్రామాలు ఎంపికయ్యాయి. వాటిలో జనగామ జిల్లాకు చెందిన పెంబర్తితో పాటు సిద్ధిపేట జిల్లాకు చెందిన చంద్లాపూర్ ఉన్నాయి. పెంబర్తి గ్రామం కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు ప్రసిద్ధి చెందింది. ఇత్తడి, కంచు లోహాలతో ఈ గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్దమొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళా ఖండాలు, గృహ అలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి.

దీనికితోడు ఏటా 25వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి, తద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదతర అంశాలను దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇనుము వినియోగం తెలియక ముందు నుంచే.. రాగి, ఇతర మిశ్రమ లోహాల సహాయంతో కాకతీయుల కాలం నుంచి పనిముట్లను, రోజూవారీ వినియోగ వస్తువుల తయారీకి పెంబర్తి కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే.

రెండో గ్రామం చంద్లాపూర్ విషయానికొస్తే.. రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయక కొండలు, ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే.. ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభామ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబోతకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. రంగనాయక స్వామి దేవాలయం, పరిసర ప్రాంతాలు గ్రామీణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన నేపథ్యంతోపాటుగా ఇక్కడి గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కారణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -

ఈ అవార్డులను సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో అందజేయనున్నారు. తెలంగాణ ప్రాంతంలోని కళాకృతులకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని కల్పిస్తోంది. ఏ అంతర్జాతీయ వేదికైనా.. ఇటీవల జరిగిన జీ-20 సమావేశాలైనా.. భూదాన్ పోచంపల్లి ఇక్కత్ చీరలను, ఇక్కడి నేతన్నలు నేసిన కండువాలను వివిధ దేశాల అధినేతలకు, విదేశీ ప్రముఖులకు అందజేశారు. వివిధ విభాగాలకు సంబంధించిన జీ20 సమావేశాలకు హాజరైన విదేశీ ప్రతినిధులకు కూడా పోంచపల్లిలో నేసిన చీరలను కేంద్ర ప్రభుత్వం ద్వారా బహుమతులుగా అందజేశారు. 2021లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి UNWTO ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించే విషయంలోనూ కేంద్రప్రభుత్వం ప్రత్యేక చొరవతీసుకుంది.

ప్రాకృతిక సౌందర్యం, సంస్కృతి, కళలకు పెట్టింది పేరైన తెలంగాణ గ్రామాలు, కళలకు కేంద్ర ప్రభుత్వం సరైన గౌరవాన్ని కల్పిస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ కళలకు, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు రావడంలో చొరవతీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా రెండు గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement