Sunday, April 28, 2024

Pedana – టీడీపీలో నువ్వానేనా … సంకుల సమరం

ప్రభన్యూస్, మచిలీపట్నం – పెడన అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధిగా ఎవరు పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత వచ్చింది. పోటీలో వైసీపీ అభ్యర్థులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడిరది. మంత్రి జోగి రమేష్‌ కా? ఉప్పాల రాముకా? అన్న మీమాంశకు వైసీపీ అధిష్టానం తెరదించింది. ఇక తాజాగా మరో అంశం పెడన నియోజకవర్గ తెరపై టీడీపీ పుణ్యమాని టిక్కెట్ల జంజాటం తెరమీదకు వచ్చింది. పెడనలో రోజుకో చిత్ర విచిత్ర ఊహాగానాలతో నరాలు తెగే సస్పెన్స్ రాజకీయ వర్గాలను కదలనీయటం లేదు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో .. పొత్తు ఎలా ఉంటుంది? ఏ పార్టీ అభ్యర్థి రంగంలోకి దిగుతారు? ఉమ్మడి అభ్యర్థిని ఈ రెండు పార్టీలు గెలిపిస్తాయా? లేక కుల రాజకీయాల్లో తలోదారి వెతుక్కుంటాయా? కాపు, గౌడ సామాజిక వర్గాల మధ్య మిత్ర లాభం ఎంతమేరకు పని చేస్తుందనే అంశంపై పెడన నియోజకవర్గంలో పెద్ద చర్చే జరుగుతోంది.

సంకుల కార్డు…

ఈ నియోజకవర్గంలో బలమైన బీసీ సామాజిక వర్గానికే పెద్ద పీట పేరిటమంత్రి జోగి రమేష్కు వైసీపీ మళ్లీ అవకాశం ఇవ్వగా… ఇప్పటి వరకూ బీసీలపైనే అందులోనూ గౌడ సామాజిక వర్గంపై గంపెడాశలు పెట్టుకున్న టీడీపీ ప్రస్తుత వ్యూహంపైనే.. ఎన్నో వ్యూహాలు, అనుమానాలు చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే పెడన నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు 40వేలకు పైగా ఉందని అంచనా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకూ మల్లేశ్వరం ఇలాఖాలో కాపు సామాజికవర్గానిదే పెత్తనం. టీడీపీ ఆవిర్భావంతో గౌడ సామాజిక వర్గం తెర మీదకు వచ్చింది. ఐతే, కాంగ్రెస్ కూడా బీసీ సామాజిక వర్గానికే పెద్ద పీట వేయటంతో ఏపీ రాష్ట్ర విభజన తరువాత కూడా బీసీలకే ప్రాధాన్యం లభించింది. కానీ.. జనసేన తెరమీదకు వచ్చిన తరుణంలో.. 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఈ సారి ఎలాగైన తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని తహతహలాడుతోంది. సరీగా ఈ సమయంలోనే టీడీపీ పొత్తుతో జనసేనకే పెడన అప్పగిస్తారని కాపు సామాజికవర్గం ఆశించించింది. కానీ, ఇదే జరిగితే నియోజకవర్గంలో బీసీలు ఏకం కావటం ఖాయం. పైగా జనసేనలో పట్టున్న నాయకుడు ఎవరు లేరు. మంత్రి జోగి రమేష్ను ఢీకొనగలిగే నాయకుడు లేరు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీకే పెడన బాధ్యతలు అప్పగించక తప్పదనేది జనసైనికుల అభిప్రాయం.

టీడీపీలో ఉక్కిరి బిక్కిరి

ప్రస్తుతం పెడన టిక్కెట్టుపై టీడీపీలో ఉక్కిరి బిక్కిరి తప్పటం లేదు. .మాజీ డిఫ్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, నియోజకవర్గ సమన్వయకర్త కాగిత కృష్ణ ప్రసాద్ వర్గాల మధ్య పోటీ అనివార్యమైంది. ఈనియోజకవర్గం నుంచి బూరగడ్డ వేదవ్యాస్ రెండు సార్లు గెలిచారు. అదీ టీడీపీ అభ్యర్థిగా కాదు.. కాంగ్రెస్ టిక్కెట్టుపై విజయం సాధించారు. ఇక మల్లేశ్వరం నియోజకవర్గంలో వేదవ్యాస్‌ తండ్రి నిరంజనరావు సమితి ప్రెసిడెంటుగా, శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయన మరణానంతరం వేదవ్యాస్‌ ఈనియోజకవర్గంలో పట్టు సాధించారు. తెలుగుదేశం పార్టీలోనూ కార్యకర్తలు, సొంత అనుచరులు (కాపు సామాజికవర్గంలో)అభిమానులు వేదవ్యాస్‌కు ఉన్నారు. గత ఎన్నికల్లో వేదవ్యాస్‌ పెడన నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించారు. చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాగిత కృష్ణ ప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. వైసీపీ సునామీలో కాగిత కృష్ణ ప్రసాద్ ఓడిపోయారు.

- Advertisement -

అప్పటి నుంచి ఆయన పెడన నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో తాను కాగిత కృష్ణ ప్రసాద్‌ కోసం కృషి చేసినందున ఈసారికి తనకే టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబునాయుడు, లోకేష్‌ను బూరగడ్డ వేదవ్యాస్ కోరుతున్నారు. 2009 నుంచి బూరగడ్డ వేదవ్యాస్ నిలకడ లేదని, పీఆర్పీలో బందరు నుంచి పోటీ చేశారని, ఆ తరువాత కాంగ్రెస్లోనూ, వైసీపీలోనూ చేరారు. 2014లో టీడపీలో చేరారు. ముడా చైర్మన్గా పదవి పొందరు. కానీ పార్టీ ఓడిపోయినా.. కృష్ణ ప్రసాద్ పార్టీ మారలేదని, క్షేత్ర కార్యకర్తలతో మమేకమయ్యారని, ప్రతి టీడీపీ కార్యకర్త కృష్ణ ప్రసాద్ వెంటే ఉన్నారని టీడీపీలో బలమైన వర్గం వాదిస్తోంది. వీరిద్దరూ పోటా పోటీగాసీటు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పెడన అసెంబ్లీ నియోజకవర్గం 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా జోగి రమేష్‌, టీడీపీ అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్‌, జనసేన అభ్యర్థిగా అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌లు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జోగి రమేష్‌కు 61920, కాగిత కృష్ణ ప్రసాద్‌కు 54.081, అంకె లక్ష్మీ శ్రీనివాస్‌కు 25,733 వచ్చాయి. జోగి రమేష్‌ 7,839 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కలసి పోటీ చేస్తే.. సమష్టిగా కృషి చేస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు. లేదూ రెండు వర్గాల మధ్య తగువును తీర్చటానికి నడుమ ఉభయతారక నేతను రంగంలోకి దించితే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement