Monday, April 29, 2024

Heat Politics – తిరువూరు చిచ్చు… తెలుగుదేశంలో ర‌గ‌డ‌

బెజవాడ రాజకీయాలు రాజుకున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ తేడాలేకుండా.. ఇరువర్గాల్లోనూ అధిపత్యపోరు వీధికెక్కింది. బెజవాడకు కీలక పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం వరకూ పార్టీల్లో దాయాదుల పోరు తారాస్థాయికి చేరింది. విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులతో వైసీపీలో రణరంగం మరో మలుపును తిప్పుతుంటే.. టీడీపీలోనూ ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధిష్టానం కళ్లెం వేయటంతో.. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ భవిష్యత్తు కార్యాచరణపై తీవ్ర చర్చోప చర్చలు జరుగుతున్నాయి.

(ప్రభన్యూస్, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో ) – మూడోసారి కూడా తానే ఎంపీగా పోటీ చేస్తానని ప్రస్తుత ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) ఒకవైపు ప్రకటించగా.. సేవా కార్యక్రమాలతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే పనిలో కేశినేని శివనాథ్(చిన్ని) మరో వైపు ముందుకు వెళుతున్న తరుణంలో.. టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిపై అధినేత చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం తర్వాత సందర్భానుచితంగా పార్టీ నేతలు, అధినేతపై విమర్శలు చేస్తూ వస్తున్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసీనేని శ్రీనివాస్‌ను పక్కన పెడుతూ కొత్తవారికి ఈసారి అవకాశం కల్పిస్తున్నట్లు నానికి పార్టీ పూర్తి క్లారిటీ ఇచ్చింది.

కేశినేనితో ప‌లువురు భేటీ..
పార్టీ సీనియర్ నేతలు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, కొనకల్ల నారాయణరావు కేశినేనినానితో చర్చలు జరిపి చంద్రబాబు అభిప్రాయాన్ని తెలిపారు. ఇటీవల తిరువూరులో ఎంపీ కేసినేని నాని ఇన్చార్జి పై చేసిన విమర్శలను సీరియస్ గా తీసుకున్న బాబు ఎంపీ అభ్యర్థిపై ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇన్ చార్జీగా వేరొకరికి అవకాశం ఇస్తున్నట్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తనను అధినేత బాబు చెప్పినట్లుశుక్రవారం సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని తెలిపారు. అధినేత ఆదేశాలను శిరసా వహిస్తానని స్పష్టం చేశారు. నానినే స్వయంగా తాను తప్పుకున్నట్లు ప్రకటించిన పరిస్థితుల్లో కేశి నేని చిన్ని ఎంపీ అభ్యర్థి అంటూ పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. తాను మాత్రం పార్టీలోనే సాధారణ కార్యకర్తను మాత్రమేనని, సేవా కార్యక్రమాల్లో నాయకులను భాగస్వాములను మాత్రమే చేస్తున్నట్లు చెబుతున్నారు. బీసీ సభను విజయవంతం చేయడం, సీఎం గా చంద్రబాబును గెలిపించడమే తన ముందున్న ఏకైక లక్ష్యం అంటున్నారు.

నాని స్వయం కృతమా?

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఊహించని పరాజయాన్ని చవిచూసి, పూర్తి నైరాశ్యంలోని క్యాడర్, పార్టీ నేతలకు కేశినేని శ్రీనివాస్ విమర్శలు మింగుడు పడలేదని చెప్పాలి. వైసీపీ గాలి బలంగా వీస్తున్న సందర్భంలోనూ తన కష్టంతోనే గెలుపొందినట్లు ఆయన ప్రకటించడం, పార్టీ పనితీరు, అధినేత పై తరచూ విమర్శలు చేస్తూ వచ్చారు. ఒకానొక దశలో ఆయన ప్రకటనలను విన్న ప్రజలందరూ పార్టీ మారి బీజేపీలోకి వెళ్తారనే చర్చ కూడా జరిగింది. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లోనీ టీడీపీ ఇన్చార్జిలతో ఆయన సఖ్యతగా లేకపోవడం తరచూ ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తుండడం కూడా క్యాడర్ కు అస్సలు నచ్చలేదు. మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు ఎప్పటికప్పుడు చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన యువగళం పాదయాత్రకు కూడా ఆయన క్యాడర్ అంటి ముట్టనట్లుగా వ్యవహరించింది,

తిరువూరు రగడతో ..

- Advertisement -

సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు పైనే నిత్యం విమర్శలు చేస్తూ వివాదాల్లో ఉండే కేసినేని నాని దూకుడుకు టీడీపీ అధిష్టానం తిరువూరు రగడతో చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ పలువురు పార్టీ ముఖ్య నేతలు, ఇన్చార్జులు, అధినేతపై విమర్శలు చేస్తూ వచ్చిన కేసినేని నాని, ఇటీవల తిరువూరులో జరిగిన పార్టీ సమావేశంలో అక్కడ ఇన్చార్జి పై చేసిన విమర్శలు, పార్టీలోనూ, రాజకీయంగా వివాదాలకు దారితీసింది. కేశినేని వ్యవహార శైలిపై ఇక్కడి నేతలు ఎప్పటికప్పుడు అధినేతను కలిసి చెబుతూ వచ్చినప్పటికీ ఆయన వ్యవహార శైలిలో మాత్రం మార్పు రాలేదని, ఇక తిరువూరులో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలితో సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం నేపథ్యంలో పార్టీ అధినేత దిద్దుబాటు చర్యల్లో భాగంగా నానిని తప్పించారని ప్రచారం జరుగుతోంది.

ప్రజలే నిర్ణయిస్తారు : కేశినేని నాని

2024 మే వరకు నేనే విజయవాడ ఎంపీ నే..నా రాజకీయ భవిష్యత్తును విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారు, అని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో మరో సారి స్పందించారు. ఎందుకు తొందర పడుతారు. రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో? ఎవరికి తెలుసు? రేవంత్ రెడ్డిని దొంగ అన్నారు. కానీ ఆయనే సీఎం అయ్యాడు. గొడవలు పెట్టడం నా నైజం కాదు, అంతమాత్రాన నాటి చేతకానితనం కాదు..తిరువూరు సభ వరకూ గొడవ ఎందుకు జరగాలని దూరంగా ఉంటున్నా. లోకేష్ పాదయాత్ర విజయవాడలో ప్రశాంతంగా సాగింది. అని కేశినేని నాని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement