Thursday, May 2, 2024

Inside Matter | తాండూరు టికెటిస్తే ఉంటా.. లేకుంటే పోతాన‌న్న ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అసెంబ్లి ఎన్నికల్లో తనకు పోటీచేసే అవకాశం ఇస్తే పార్టీలో కొనసాగుతానని, లేనిపక్షంలో పార్టీ మారే విషయాన్ని ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ ఎస్‌ కీలక నేత , మాజీ మంత్రి , మండలి సభ్యుడు పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. పార్టీ మారనున్నారన్న ప్రచారం నేపథ్యంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ.రామారావు బుధవారం మహేందర్‌రెడ్డి, ఆయన సోదరుడు కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని ప్రగతి భవన్‌కు పిలిపించి వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది.

పార్టీ వీడొద్దని, ప్రస్తుతం సర్వేలు జరిపిస్తున్నామని, ఆ నివేదికల ఫలితాలు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందామని కేటీ రామారావు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. టికెట్‌ విషయంలో తన వైఖరి మారదని, తాండూరు అసెంబ్లికి భారాస అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని అందుకు అంగీకరిస్తే పార్టీలో ఉంటానని మహేందర్‌రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. భారాస తిరిగి అధికారంలోకి వస్తోందని ఈ దఫా మంత్రి పదవిని ఇస్తామని కేటీ రామారావు హామీ ఇవ్వగా తొలుత అసెంబ్లి ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వండి, మంత్రి పదవి సంగతి తర్వాత మాట్లాడుకుందామంటూ మహేందర్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఈలోపు పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌కు కేటీ రామారావు ఫోన్‌ కలిపి మహేందర్‌రెడ్డితో మాట్లాడించినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ సైతం పార్టీ మారొద్దంటూ మహేందర్‌రెడ్డికి చెప్పగా మహేందర్‌రెడ్డి కూడా తనకు తాండూరు టికెట్‌ను ఖరారు చేయాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది.

కాగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి గెలుపొందిన రోహిత్‌రెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా భారాస పంచన చేరారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన 12మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లి పోటీ చేసే అవకాశం ఇస్తానని అప్పట్లో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అయితే తాండూరు నుంచి భారాస అభ్యర్థిగా తనకే పోటీ చేసే అవకాశం వస్తుందని మహేందర్‌రెడ్డి చెబుతూ వచ్చారు. అసెంబ్లిd ఎన్నికలు సమీపిస్తున్న నేప థ్యంలో తమ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనగా ఉన్న మహేందర్‌రెడ్డి పార్టీ మారే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. కాగా కేటీఆర్‌ను కలిసిన మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డిని కూడా కేటీఆర్‌ బుజ్జగించినట్లు సమాచారం. మహేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఆయన సతీమణి సునితారెడ్డి రంగారెడ్డి జిల్లా ఛైర్మన్‌గా, సోదరుడు నరేందర్‌రెడ్డి కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement