Sunday, May 5, 2024

Punjab: మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కు సీరియస్.. హాస్పిటల్ కు తరలింపు

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ లీడర్ ప్రకాష్ సింగ్ బాదల్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో అతడిని శనివారం ముక్త్సర్ జిల్లా నుండి చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER)కి తరలించారు. జనవరిలో కొవిడ్ పాజిటివ్ రావడంతో లుథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (DMCH) లో చేరారు. ఆ తర్వాత కొద్దిరోజులకే కోలుకుని ఇంటికి వచ్చారు.

94 ఏళ్ల వయస్సులోనూ ఎన్నికల్లో పోటీకి..

అకాలీదళ్ లీడర్ అయిన ప్రకాశ్ సింగ్ బాదల్ 94 ఏళ్ల వయస్సులోనూ పంజాబ్ ఎన్నికల్లో పోటీకి దిగారు. లాంబి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి నామినేషన్ కూడా దాఖలు చేశారు. కాగా, ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తుల్లో దేశంలోనే అతి పెద్ద వయస్సున్న అభ్యర్థిగా ఆయన ఉన్నారు. పంజాబ్‌లోని లంబి నియోజకవర్గంలో ప్రకాష్ సింగ్ బాదల్ కవరింగ్ అభ్యర్థిగా.. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ప్రకాష్ సింగ్ బాదల్ 1997 నుండి లాంబి స్థానం నుండి గెలుపొందారు. అంతకు ముందు 1969, 1972, 1977, 1980 , 1985లలో గిద్దర్‌బాహా నుండి వరుసగా ఐదుసార్లు గెలిచారు. ఆ తర్వాత లాంబి నియోజకవర్గానికి మారారు. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 20వ తేదీన పోలింగ్ జరగనుండగా, మార్చి 10న కౌంటింగ్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement