Saturday, April 27, 2024

బీజింగ్‌ వింటర్‌.. ఒలింపిక్స్‌ 2022 షురూ!.. భారత్‌ ఫ్లాగ్‌ బేరర్‌గా స్కైయర్‌ ఆరిఫ్‌ఖాన్‌

చైనా రాజధాని బీజింగ్‌లో వింటర్‌ ఒలింపిక్స్‌ 2022 నిన్న అధికారికంగా ప్రారంభమయ్యాయి. బీజింగ్‌ నేషనల్‌ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుకల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌, పాక్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. బర్డ్స్‌ నెస్ట్‌ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఫిబ్రవరి 4నుంచి 20వరకు వింటర్‌ ఒలింపిక్స్‌ జరగనున్నాయి. 2022 వింటర్‌ ఒలింపిక్స్‌ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారతజెండా బేరర్‌గా అరిఫ్‌ఖాన్‌ వ్యవహరించాడు. వేడుకల అనంతరం 24వ బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభమైనట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అధికారికంగా ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేవిధంగా రూపొందించిన క్లోజ్డ్‌ లూప్‌ బుబుల్‌లో క్రీడలు నిర్వహించనున్నారు. కాగా చైనాలో ముస్లిం మైనారిటీల హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు దత్యపరంగా బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఆ దేశాల అథ్లెట్లు మాత్రం క్రీడల్లో పతకాల కోసం పోటీపడనున్నారు.

భారత్‌ కూడా చైనా తీరును నిరసిస్తూ దత్యపరంగా బాయ్‌కాట్‌ చేసింది. కాగా వింటర్‌ ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి కాశ్మీర్‌కు చెందిన స్కైయర్‌ ఆరీఫ్‌ఖాన్‌ ఒక్కడే స్కీయింగ్‌లో పోటీపడుతున్నాడు. వింటర్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో ఈసారి 91దేశాలు పోటీపడుతుండగా భారత్‌నుంచి ఒక్క అథ్లెట్‌ మాత్రమే పాల్గొనున్నాడు. ఫిబ్రవరి 4నుంచి 20వరకు జరిగే బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో 31ఏళ్ల స్కీయర్‌ ఆరిఫ్‌ఖాన్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఏకైక ఆటగాడు. ఆరిఫ్‌ రెండు ఈవెంట్లలో పోటీపడనున్నాడు. కాశ్మీర్లోని గుల్‌మార్గ్‌కు చెందిన ఆరిఫ్‌ ఈ గేమ్స్‌లో స్లాలమ్‌, జెయింట్‌ స్లాలమ్‌ విభాగాల్లో పాల్గొంటాడు. ఈ ఈవెంట్లు ఫిబ్రవరి 13, 16తేదీల్లో జరగనున్నాయి. ఈసారి క్రీడల్లో ఫ్రీస్టైల్‌ స్కీయింగ్‌ (మిక్స్‌డ్‌ జెండర్‌ టీమ్‌ ఏరియల్స్‌, పురుషుల బ్యాగ్‌ ఎయిర్‌, మహిళల బ్యాగ్‌ ఎయిర్‌), షార్ట్‌ ట్రాక్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ (మిక్స్‌డ్‌ టీమ్‌ రిలే), స్కైజంపింగ్‌ (మిక్స్‌డ్‌ టీమ్‌) స్నో బోర్డింగ్‌ (మిక్స్‌డ్‌ టీమ్‌ స్నో బోర్డ్‌ క్రాస్‌) కొత్తగా చోటు చేసుకున్నాయి. హైతీ, సౌదీ అరేబియా వింటర్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి పోటీపడనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement