Saturday, May 4, 2024

Paris: ప్లగ్‌ అండ్‌ ప్లే.. హైదరాబాద్‌కు మరో ఇంటర్నేషనల్‌ ప్రాజెక్టు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఓపెన్‌ ఇన్నోవేషన్‌ ప్లాట్‌ఫారమ్‌ ”ప్లగ్‌ అండ్‌ ప్లే” దేశంలో మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యంగా ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌తో ప్లగ్‌ అండ్‌ ప్లే సంస్థ నాయకత్వ బృందంతో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఫ్రెంచ్‌ ప్రభుత్వం, బిజినెస్‌ ఫ్రాన్స్‌లు నిర్వహిస్తున్న ‘యాంబిషన్‌ ఇండియా’ ఈవెంట్‌ సందర్భంగా ఈ సమావేశం జరిగింది.

అతిపెద్ద ఎర్లీ స్టేజ్‌ ఇన్నోవేటర్‌గా, ఆక్సిలరేటర్‌గా ప్రఖ్యాత కార్పొ రేట్‌ ఇన్నోవేషన్‌ ప్లాట్‌ఫారమ్‌గా పేరొందిన ”ప్లగ్‌ అండ్‌ ప్లే” నెట్‌ వర్క్‌లో ప్లేబుక్‌లో 530కి పైగా ప్రపంచ, ప్రముఖ కార్పొరేషన్లు, 35వేల స్టార్టప్‌లు ఉన్నాయి. వీటితో పాటు వెంచర్‌ ఫండింగ్‌లో తొమ్మిది బిలియన్ల అమెరికన్‌ డాలర్లు సేకరించిన 1500 యాక్టివ్‌ పోర్ట్‌ ఫోలియో పెట్టుబడులు కూడా ఈ సంస్థలో భాగంగా ఉన్నాయి. ప్లగ్‌ అండ్‌ ప్లే సంస్థకు సిలికాన్‌ వ్యాలీ (అమెరికా, స్టుట్‌గార్ట్‌ (జర్మనీ), పారిస్‌ (ఫ్రాన్స్‌), ఒసాకా (జపాన్‌), షాంఘై (చైనా), వాలెన్సియా (స్పెయిన్‌), ఆమ్‌స్టర్‌డామ్‌ (నెదర్లాండ్స్‌)తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 37 కార్యాలయాలున్నాయి.

గూగుల్‌, పేపాల్‌, డ్రాప్‌బాక్స్‌, లెండింగ్‌ క్లబ్‌, ఎన్‌26, సౌండ్‌హౌండ్‌, హనీ లాంటి పేరుగాంచిన కంపెనీల తొలి ఇన్వెస్టర్‌గా ”ప్లగ్‌ అండ్‌ ప్లే” ఘనత వహించింది. 2020లో 2,056 స్టార్టప్‌ల వృద్ధిని వేగవంతం చేసిన ”ప్లగ్‌ అండ్‌ ప్లే” కంపెనీ అదే సంవత్సరంలో 162 వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టింది. ఇది మొబిలిటీ, ఐవోటీ, ఎనర్జీ, అగ్రిటెక్‌, హెల్త్‌, సస్టైనబిలిటీ, ట్రావెల్‌, ఫిన్‌టెక్‌ మొదలైన అనేక వర్టికల్స్‌పై దృష్టి పెడుతుంది. మొదటిసారిగా భారతదేశంలో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఈ సంస్థ హైదరాబాద్‌లో మొబిలిటీ, ఐవోటీ, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో పటిష్టమైన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెడుతుంది.

తదుపరి దశలో ఫిన్‌టెక్‌, లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌ కేర్‌ రంగాలకు విస్తరించనుంది. సీటెల్‌లో ఉన్న వెంచర్‌ ఫౌండ్రీ ట్రయాంగులమ్‌ ల్యాబ్స్‌, ఐవోటీ, స్మార్ట్‌సిటీల కోసం ఇంక్యుబేషన్‌ అమలు చేయడానికి హైదరాబాద్‌లో ”ప్లగ్‌ అండ్‌ ప్లే” టెక్‌ సెంటర్‌తో కలిసి పనిచేస్తుంది. ఈ సందర్భంగా జర్మనీ స్టార్టప్‌ ఆటోబాస్‌ ఎండీ సస్చా కారింపౌర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చూపిన ఉత్సాహాన్ని, చొరవను అభినందించారు. కేటీఆర్‌ అందించిన ప్రోత్సాహం సహాయంతో ‘ప్లగ్‌ అండ్‌ ప్లే” భారతదేశంలో అత్యంత విజయవంతమైన కొలాబరేషన్‌ ప్లాట్‌ఫా రమ్‌ నిర్మిస్తుందని ఆయన అన్నారు. రికార్డు సమయ ంలో నవీన సాంకేతిక సహకారానికి అంతర్జాతీయ కేంద్రంగా మారిన జర్మనీలోని స్టార్టప్‌ ఆటోబాస్‌లాగా హైదరాబాద్‌లోని ”ప్లగ్‌ అండ్‌ ప్లే” టెక్‌ సెంటర్‌ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement