Sunday, April 28, 2024

ఒమిక్రాన్‌ విస్ఫోటనం.. 32కు చేరిన బాధితులు.. మహారాష్ట్రలో 17 మందికి పాజిటివ్‌

న్యూఢిల్లి: భారత్‌లో మరోసారి ఒమిక్రాన్‌ కేసులు కలకం రేపాయి. శుక్రవారం మహారాష్ట్రలో ఏకంగా ఏడు కేసులు వెలుగులోకొచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 32కు చేరింది. తాజాగా మహారాష్ట్రలో ఏడు, గుజరాత్‌లో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకొచ్చాయి. మహారాష్ట్రలో వెలుగులోకొచ్చిన ఏడు కేసుల్లో.. ముగ్గురు ముంబైవాసులు కాగా.. మరో నలుగురు పింప్రి చించ్‌వాడాకు చెందినవారుగా గుర్తించారు. ఇందులో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. దీంతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 17కు చేరుకుంది. ముంబైలో ఒమిక్రాన్‌ బాధితుల వయస్సు 48, 25, 37గా నిర్ధారించారు. వీరు టాంజానియా, యూకే, దక్షిణాఫ్రికా వెళ్లివచ్చారు. నలుగురు బాధితులు రెండు డోసుల తీసుకోగా.. ఒకరు ఒక డోసు వేయించుకున్నాడు. మరో చిన్నారికి మూడున్నరేళ్లు ఉంది. వ్యాక్సిన్‌కు అర్హత పొందలేదు. మరొకరు ఒక్క డోసు కూడా తీసుకోలేదు.

జామ్‌నగర్‌లో ఇద్దరికి..
జామ్‌నగర్‌లో ఇద్దరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి ఇప్పటికే అక్కడ ఒమిక్రాన్‌ వచ్చింది. ఆ వ్యక్తితో టచ్‌లో ఉన్న ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణ కావడం సంచలనం రేపింది. గుజరాత్‌లో ఇది మూడో ఒమిక్రాన్‌ కేసు. గుజరాత్‌లో తాజాగా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిన వాళ్లను క్వారంటైన్‌ చేశారు. టాంజానియా నుంచి ముంబైలోని ధారావికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ కావడంతో.. సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో చికిత్స కల్పిస్తున్నారు.

అందరికీ తేలికపాటి లక్షణాలే: – లవ్‌ అగర్వాల్‌
దేశంలో ఇప్పటి వరకు 32 ఒమిక్రాన్‌ కేసులు నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఒమిక్రాన్‌ బారినపడిన వారిలో అందరిలో తేలికపాటి లక్షణాలు ఉన్నట్టు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా మహారాష్ట్రలో 17 ఒమిక్రాన్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్నాటకలో 2, ఢిల్లిdలో ఒక కేసు వెలుగులోకొచ్చింది. వారం రోజుల క్రితం జింబాబ్వే నుంచి 72 ఏళ్ల ఎన్‌ఆర్‌ఐ గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు రాగా.. ఆయనలో కొత్త వేరియంట్‌ సోకినట్టు తేలింది. ఆ మరుసటి రోజు అతని భార్యతో పాటు బావమరిదికి పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం వారి శాంపిల్స్‌ గాంధీనగర్‌లోని గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌కు తరలించారు. ఆ ఇద్దరిలోనూ ఒమిక్రాన్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వారిని జామ్‌నగర్‌లోని గురుగోవింద్‌ సింగ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒమిక్రాన్‌ వార్డుకు తరలించినట్టు అధికారులు తెలిపారు.

ముంబై బాధితుడి డిశ్చార్జి
ఒమిక్రాన్‌ బారినపడిన తొలి వ్యక్తి కోలుకున్నాడు. ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలో నెగిటివ్‌ ఫలితం రావడంతో.. బుధవారమే అతన్ని సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ముంబైలో ఒమిక్రాన్‌ బారినపడిన మరో వ్యక్తి కూడా కోలుకుంటున్నట్టు సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతనికి కూడా నెగిటివ్‌ ఫలితం వస్తుందనే నమ్మకం ఉందన్నారు. తరలోనే అతన్ని కూడా డిశ్చార్జి చేస్తామని తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి 39 ఏళ్ల వ్యక్తి గత నెల 25న ముంబై వచ్చాడు. అతనికి కాబోయే భార్య కూడా అదే రోజు అమెరికా నుంచి వచ్చింది. తరువాత ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు బయటపడటంతో ఆస్పత్రిలో చేరారు. పరీక్షల తరువాత ఒమిక్రాన్‌గా వెల్లడించారు. కాబోయే భార్యకు పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. ఇద్దరినీ సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేశారు. వ్యక్తి కోలుకుంటుండగా.. మహిళకు నెగిటివ్‌ వచ్చింది. అయితే సల్ప లక్షణాలు ఉండటంతో మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement