Monday, April 29, 2024

లోకల్‌ పోస్టుల్లో నాన్‌ లోకల్‌ ఉద్యోగులు.. గందరగోళంగా మారిన 317 జీవో

తెలంగాణలో ఉపాధ్యాయ విభజన అంతా గందరగోళంగా మారింది. ఈ విభజనతో భవిష్యత్తులో నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. కొందరి అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులను ఆయా జిల్లాల నిరుద్యోగ యువత ఎదుర్కొవడమే కాకుండా ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. కొత్త జిల్లాలకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజనలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోతో స్థానికతకు తూట్లు పడుతున్నాయని మండిపడుతున్నారు. ఈ కొత్త జీవో వల్ల 95శాతం లోకల్‌, 5శాతం నాన్‌లోకల్‌ నిబంధన అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపుల ప్రక్రియ పూర్తయ్యింది. ఇక మిగిలింది పాఠశాలల అలకేషన్‌ మాత్రమే.

అయితే సీనియారిటీ ప్రకారం చూస్తే ఎక్కువ సీనియారిటీ ఉన్న వారు చాలా మంది అర్బన్‌ జిల్లాలకు, సిటీకి దగ్గర ఉండే ప్రాంతాలకు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చుకుని వెళ్లిపోయారు. సర్వీస్‌ తక్కువగా ఉన్న జూనియర్‌ టీచర్లు మాత్రం ములుగు, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ఆదిలాబాద్‌ లాంటి రూరల్‌ ప్రాంత జిల్లాలకు కేటాయించబడ్డారు. దీంతో భవిష్యత్తులో అర్బన్‌ జిల్లాల్లో రిటైర్మెంట్లు తొందరగా అయ్యే వీలుంటే రూరల్‌ ప్రాంతాల్లో కేటాయించబడిన జూనియర్లతో రిటైర్మెంట్లు చాలా ఆలస్యంగా అయ్యే వీలుంది. అర్బన్‌ జిల్లాల్లో రిటైర్మెంట్‌ ద్వారా ఖాళీలు తొందరగా ఏర్పడితే రూరల్‌ జిల్లాల్లో మాత్రం చాలా సమయం పడుతోంది. లోకల్‌ పోస్టుల్లో నాన్‌లోకల్‌ వాళ్లు వచ్చి చేరడంతో భవిష్యత్తులో ఖాళీ పోస్టులు ఏర్పడక ఆయా జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతాయనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement