Monday, May 6, 2024

ద‌ళిత’రాబంధు’ల‌ కు టిక్కెట్ ఫ‌ట్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: దళితబంధు పథకం అమలులో చేతి వాటం ప్రదర్శిస్తున్న పార్టీ శాసన సభ్యులకు టాటా చెప్పాలన్న నిర్ణయానికి భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చినట్టు- తెలుస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించి కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాలలో అక్రమాలకు పాల్పడుతున్నారని, లబ్ధిదారుల నుంచి ముడుపులు తీసుకుని 10 లక్షల రూపాయలను మంజూరు చేయిస్తున్నట్టు- తన దృష్టికి వచ్చిందని, ఇకనైనా ఇటు-వంటి అవినీతి కార్యక్రమాలకు దూరంగా ఉండకపోతే వారిని తాను దూరం చేసుకుంటానని రెండు మాసాల క్రితం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

అయినా ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోకపోవడంతో ఆరోపణలు ఎదుర్కొంటు-న్న వారిని దూరంగా పెట్టాలన్న కృతనిశ్చయానికి వచ్చినట్టు- సమాచారం. దళిత బంధు పథకం అమల్లో తన హెచ్చరికలను పెడచెవిన పెట్టిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కొత్త వారిని ఎంపిక చేసే ప్రక్రియకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ-కి పెట్టేవారిని వచ్చే నెలలో పిలిపించి వారిని ఎన్నికలకు సిద్ధమవ్వాలన్న సంకేతాలను ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తిరిగి వారినే ఎన్నికల బరిలో నిలబెడితే విపక్ష పార్టీలు అదే పనిగా ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి ఓటర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటు-ందన్న చర్చ అంతర్గతంగా జరిగిన పార్టీ సమావేశంలో కొందరు సీనియర్‌ నేతలు అభిప్రాయపడ్డారని, అందుకే సీఎం కేసీఆర్‌ ఈ నెల 27న నిర్వహించిన భారాస ప్లీనరీ సమావేశంలో దళితబంధు పథకంలో పలువురు శాసనసభ్యులు ఒక్కో లబ్ధిదారుడి నుంచి మూడు లక్షలు వసూలు చేసినట్టు- తన దృష్టికి వచ్చిందని ప్రకటించి.. ఎమ్మెల్యేల భరతం పడతానని హెచ్చరించారు.

దళితబంధు పథకం తన ఆత్మబంధు పథకమని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. జాతీయ స్థాయిలో భారాస అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా ఈ ప్రతిష్టాత్మకమైన పథకాన్ని అమలు చేస్తానని చేసిన ప్రకటనను ప్లీనరీ భేటీ-లోనూ ప్రస్తుతించారు. ఈ పథకం అమలులో ఎవరు అక్రమాలకు, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని ఆయన ఎమ్మెల్యేలకు తలంటుపోశారు.
‘ఏం మీ ఇంటి సొమ్ము అనుకున్నారా? సర్కార్‌ ఇచ్చే దళిత బంధు పథకానికి మూడు లక్షల కమీషన్‌ అడుగుతున్నారట… ఉంటారా.. పోతారా’ అంటూ ఆ మధ్య పలు నియోజక వర్గాల నాయకుల్ని ఉద్దేశించి కేసీఆర్‌ హెచ్చరికలు జారీ చేశారని సమాచారం. తాజాగా తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రతినిధుల సదస్సులో కూడా… వసూళ్లు చేసిన ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గరుందని, పద్ధతి మార్చుకోండి అంటూ కేసీఆర్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. కొన్నిచోట్ల అయితే నేతల బంధువుల పేర్లతో సహా లిస్ట్‌లు బయటికి వస్తున్నాయి. దీంతో ఈ ప్రచారం ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని ఆ నియోజక వర్గ ఎమ్మెల్యేల్లో దడ మొదలైందని సమాచారం. వీరిలో ఒకరిద్దరు అధినేత కేసీఆర్‌ను కలిసి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు ససేమిరా అన్నట్టు- తెలుస్తోంది. చివరికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీ- రామారావును కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామని ఎమ్మెల్యేలు ప్రయతించినా అక్కడా చుక్కెదురైనట్టు- ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఆయా జిల్లా మంత్రులు సైతం చేతులు ఎత్తేసినట్టు- ప్రచారం జరుగుతోంది. దళితబంధు పథకంలో జరుగుతున్న లావాదేవీలపై సీఎం కేసీఆర్‌కు సమగ్రమైన సమాచారం ఉందని, ఎమ్మెల్యేలను వెంటబెట్టు-కుని తాము ఆయన దగ్గరకు తీసుకెళ్తే ప్రగతి భవన్‌లోకి తమకు శాశ్వతంగా అనుమతి నిలిచిపోతుందని ఓ సీనియర్‌ మంత్రి తమ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించినట్టు- చెబుతున్నారు.

ఇటీవల ఆదిలాబాద్‌ జడ్పీ సర్వసభ్య సమావేశంలో కొందరు జడ్పీటీ-సీలు సైతం దళితబంధు వసూళ్లపై ఆరోపణలు చేసినట్టు- సమాచారం. ఒకే గ్రామంలో రెండు లక్షల చొప్పున చాలా మంది లబ్ధిదారుల నుంచి అక్రమంగా ఆమ్యామ్యాలు వసూలు చేసినట్లు- గుడిహత్నూర్‌ జడ్పీటీ-సీ ఆరోపించారు. దళితబంధులో అవినీతికి పాల్పడిన అవినీతి ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గరుందని సీఎం చేసిన ప్రకటన ఎమ్మెల్యేలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. సీఎం దగ్గరున్న చిట్టాలో తమ పేర్లు ఉన్నాయో, లేదోనని తెలుసుకునే పనిలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారని జిల్లాకు చెందిన మంత్రులు ద్వారా ప్రయత్నిస్తుండగా మరి కొంత మంది కేసీఆర్‌కు అత్యంత సన్నిహతంగా ఉండే నేతలను ఆశ్రయించి వారి ద్వారా సమాచారం సేకరించే పనిలో ఉన్నట్టు- సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement