Tuesday, May 14, 2024

చినుకు జాడేది … ‘నైరుతి’ కోసం రైతుల ఎదురుచూపు

మానవపాడు జూన్30(ప్రభన్యూస్) నైరుతి రుతుపవనాల జాడేలేదు. తొలకరి జల్లుల పలకరింపు లేనేలేదు. మండే ఎండలతో జోగుళాంబ గద్వాల జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా జూన్‌ మొదటి వారంలోనే కురిసే తొలకరి వర్షాలు..జూన్ నెల పూర్తికావొస్తున్నా పత్తాలేకుండా పోయాయి. మెట్టపంటల సాగు కోసం రైతాంగం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

పొడిదుక్కుల్లోనే విత్తనాలు..

రోహిణి కార్తెలో విత్తనం నాటితే ఈ సమయంలో మొక్క మొలుస్తుందని, ఆ మొక్కలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి చీడ పీడలను తట్టుకోవడంతో పాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా వస్తాయని రైతులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో రోహిణి కార్తె ప్రారంభం కాగానే జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతుల పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలు వేశారు. ఎప్పటి లాగే వర్షాలు పడితే మొలకలు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ రుతుపవనాల రాక ఆలస్యమై వానలు రాక.. ఆవిత్తనాలు మట్టిలోనే పొట్లిపోతుండటంతో రైతులు అందోళన చెందుతున్నారు. బోర్లు, బావుల నీటి ఆధారం ఉన్న రైతులు విత్తనం నాటిన రెండు మూడు రోజుల వ్యవధిలోనే తడులు మళ్లించే ప్రయత్నం చేస్తున్నా.. ప్రస్తుతం ఎండ తీవ్రతకు ఆ ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. అక్కడక్కడ రైతులు భయంతోనే పత్తి మొలకలు తెగుళ్లు,మొలక పెరగకపోవడంతో దున్నేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌ ప్రారంభంలోనే గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రుతుపవనాలు కాపాడకపోవడంతో వానాకాలం పంటల సాగు మరింత వెనక్కు వెళ్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.

- Advertisement -

జోగుళాంబ గద్వాల నడిగడ్డలో ఎండతీవ్రత తగ్గలేదు

నడీగడ్డలో ఎండ తీవ్రత తగ్గలేదు.. వాతావరణం చల్లబడలేదు.. చినుకు జాడ లేదు.. పొలాలు పదును కాలేదు.. విత్తనం పడలేదు…జూన్‌ పూర్తయిన రెండవ.పక్షం గడుస్తున్నప్పటికీ ఇంకా తొలకరి రాకపోవటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆరుద్ర కార్తెలో కూడా వాతావరణం వేసవిని తలపిస్తున్నది. ఎండలు అధికంగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.జూన్ ముగుస్తున్నప్పటికీ నైరుతి రుతు పవనాల జాడలేదు. చినుకు పడక పొలాలు పదును కాలేదు. ఇప్పటి వరకు తొలకరి కాకపోవటంతో ఈ ఏడాది ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా పరిస్థితి నెలకొంది.

వర్షాలు లేక..

కొన్నేళ్లుగా జిల్లాలో ఏటా జూన్‌ మొదటి వారంలోనే సాగు పనులు ఊపందుకుంటాయి. నైరుతి రుతుపవనాల రాకతో కురిసే తొలకరి వర్షాలకు ప్రధానంగా మెట్ట పంటలను రైతాంగం సాగు చేస్తోంది. ఈసారి ఆలస్యంగా రుతువపనాల రాష్ట్రాన్ని తాకే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేయగా.. ప్రస్తుతానికి జిల్లాలో ఆ పరిస్థితులు ఏ మాత్రం కన్పించడంలేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే చివర్లో కురిసే వర్షాలకు దుక్కులు దున్నుకొని సాగు భూములను సిద్ధం చేసుకుంటుంటారు. అయితే మే చివర్లో వర్షాలు లేకపోవడంతో చాలా వరకు భూములను రైతులు బాగు చేసుకోలేదు.

‘ముందస్తు’ ఎలా?

ఈ వానాకాలంలో అన్ని పంటలు కలిపి 3.48 లక్షల ఎకరాలలో సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. రైతులు పత్తి సాగుకే రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఏడాది 2.15 లక్షల ఎకరాలలో సాగయ్యే అవకాశముంది. వరి 82,100, కంది 15 వేలు, మొక్కజొన్న 15 వేలు, వేరుశనగ 7500 ఎకరాలు, ఇతర పంటలు 13,500ఎకరాలలో సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement