Tuesday, April 30, 2024

దసరా సెలవుల్లో మార్పు లేదు, 26 నుంచి 9 వరకు హాలిడేస్‌.. స్పష్టం చేసిన విద్యాశాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులేదు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వలు జారీ చేశారు. ఈనెల 26 నుంచి అక్టోబర్‌ 9 వరకు దసరా సెలవులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దసరా సెలవుల్లో కుదింపు ఉంటుందనే వార్త ప్రచారం కావడంతో విద్యాశాఖ ఈమేరకు స్పష్టం చేసింది. పాఠశాలలకు షెడ్యూల్‌ ప్రకారం దసరా సెలవులు 14 రోజులుకాగా, 25వ తేదీ ఆదివారంతో కలుపుకుంటే మొత్తం 15 రోజులు అవుతున్నాయి.

దీనిపై ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) డైరెక్టర్‌ ఎం.రాధారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాఠశాల విద్యాశాఖకు మంగళవారం ఆమె లేఖ రాశారు. దసరా సెలవులను తగ్గించాలని ఆ లేఖలో కోరారు. వర్షాలు, జాతీయ సమైక్యత దినం లాంటి సెలవులతో ఇప్పటికే 7 పనిదినాలు పాఠశాలలు నష్టపోయాయని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెలవులను 26 నుండి కాకుండా అక్టోబర్‌ 1 నుండి ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. లేదా నవంబర్‌, డిసెంబర్‌, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లోని రెండో శనివారం పనిదినాలుగా ప్రకటించాలని సూచించారు.

దీంతో సెలవులపై తీవ్ర గందరగోళం ఏర్పడింది. సెలవులు తగ్గనున్నాయనే వార్త ప్రచారం జరిగిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ యథావిధిగా షెడ్యూల్‌ ప్రకారమే సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు. సెలవుల విషయంలో ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే జూనియర్‌ కాలేజీలకు కూడా ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమే సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్‌ 2 నుంచి 9వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి. కళాశాలలు పున:ప్రారంభించేంది అక్టోబర్‌ 10నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement