Saturday, May 4, 2024

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.‌ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా రాష్ట్ర‌ ఎన్నికల కమిషనర్ నిమ్మ‌గ‌డ్డ ప్రసాద్ పూర్తి చేస్తారా? అన్న సందిగ్ధ‌తకు తెర పడింది. తన పదవీ కాలం పూర్తవుతుండటంతో ఎన్నికలను నిర్వహించలేనని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 31 వరకు తన పదవీ కాలం పూర్తవుతుండటంతో బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని.. ప్రస్తుత పరిస్థితుల్లో తాను షెడ్యూల్ విడుదల చేయలేనని చెప్పారు. తన తదుపరి వచ్చేవారు ఎన్నికలు నిర్వహిస్తారన్నారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చని.. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినవారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందన్నారు. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని చెప్పారు. గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పనిచేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరమే పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని నిమ్మగడ్డ వివరించారు.

ఇదిఇలా ఉంటే.. ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది. దీంతో ఏపీ ప్రభుత్వం కొత్త ఎన్నికల కమిషన్ నియామకానికి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు రిటైర్డ్ అధికారులతో కూడిన జాబితాను గవర్నర్ కు పంపింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, ప్రేమచంద్రా రెడ్డి, శామ్యూల్ పేర్లను గవర్నర్ కు ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో నీలం సాహ్నీ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎస్ గా పనిచేసి రిటైర్ అయిన నీలం సాహ్నీ.. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాన సలహాదారుగా పనిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement