Saturday, May 4, 2024

Night curfew: ఒమిక్రాన్ కట్టడికి చర్యలు.. ఆంక్షల వలయంలో రాష్ట్రాలు

భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కట్టడికి చర్యలు చేపట్టాలని కేంద్రం.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మళ్లీ కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నాయి.  క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై ఢిల్లీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ నైట్ కర్ఫ్యూ విధించాయి.

ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూని అమలు చేయాలని మధ్యప్రదేశ్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే దాక రోజూ రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆరాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

మధ్యప్రదేశ్ లో ఐదు నెలల తర్వాత కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఒక రోజులో 30కి పెరిగింది. రాష్ట్రంలో Omicron కేసు ఇప్పటివరకు నమోదు కాలేదు. అయితే, పొరుగు రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నందున.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.  అవసరమైతే, రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలు అమలు చేస్తామని తెలిపారు.

కాగా, గురువారం మధ్యప్రదేశ్ లో 30 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో కోవిడ్ -19 సంఖ్య 7,93,581 కు పెరిగింది. అలాగే, 19 మంది రోగులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి రికవరీ సంఖ్య 782,859కు పెరిగిందని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. రాష్ట్రంలో 10,531 కోవిడ్ తో ప్రాణాలు వదిలారు.

ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య పెరగడంతో ఢిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వం క్రిస్మస్‌, నూతన సంవత్సర సంబరాలపై నిషేధం విధించింది. ఈ వేడుకలను సామూహికంగా జరుపుకోకూడదని స్పష్టం చేసింది. మాస్కులు ధరించని వారిని అనుమతించొద్దని వాణిజ్య సంఘాలను ఆదేశించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది.

- Advertisement -

ముంబైలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఆరడుగుల భౌతికదూరం పాటించాలని స్పష్టం చేసింది. కొవిడ్‌ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ నెల 31 వరకు ముంబైలో అర్ధరాత్రి వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గుజరాత్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 8 ప్రధాన నగరాల్లో ఈ నెలాఖరు వరకు రాత్రిపూట కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది.

మరోవైపు నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. డిసెంబర్‌ 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగ ప్రదేశాల్లో సామూహక కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశించింది. సామూహిక వేడుకలకు అనుమతిలేదని స్పష్టం చేసింది. పబ్‌లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లలో డీజేల వినియోగంపై నిషేధం విధించింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కూడా నిబంధనలు విధించింది. నోయిడా, లఖ్‌నవూ జిల్లాల్లో డిసెంబర్‌ 31 వరకు 144 సెక్షన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement